Site icon NTV Telugu

Kurasala Kannababu: మీ భాగస్వామ్య పక్షాలే మిమ్మల్ని కడిగేస్తున్నారు..! సమాధానం చెప్పగలిగారా ..?

Kurasala Kannababu

Kurasala Kannababu

Kurasala Kannababu: మీ భాగస్వామి పక్షాలే మిమ్మల్ని కడిగేస్తున్నారు.. కనీసం దానికైనా సమాధానం చెప్పగలిగారా ..? అంటూ సీఎం చంద్రబాబును నిలదీశారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖత్ లో కలిసిశారు మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కురసాల కన్నబాబు, మేరుగు నాగార్జున.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కురసాల కన్నబాబు.. చంద్రబాబు అధికారంలోకి వస్తే కక్ష సాధించాలనుకునే కుటుంబాల్లో మేం ఉన్నామని గతంలోనే మిథున్ రెడ్డి చెప్పారని అన్నారు. వైసీపీ నాయకులపై కక్ష సాధిస్తామని గతంలోనే లోకేష్ ఊరువాడ తిరిగి చెప్పాడని గుర్తు చేశారు. దీనికి అనుగుణంగానే అరెస్టులు జరుగుతున్నాయని తెలిపారు. వైఎస్‌ జగన్ ఇచ్చిన పథకాలకంటే అధికంగా ఇస్తానని చంద్రబాబు చెప్పిన తప్పుడు మాటలు ప్రజలు నమ్మారని అన్నారు. వీటిని అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబు అమలు చేస్తున్నారని ఆరోపించారు.. అయితే, వైసీపీలో అరెస్టులకు భయపడేవారు ఎవరూ లేరన్నారు. వైఎస్‌ జగన్ ఎప్పటికే డిజిటల్ బుక్ గురించి చెప్పారని తెలిపారు. వైసీపీ నేతలకు కాదు బాధితులు ఎవరైనా సరే తమ ఆవేదనను డిజిటల్ బుక్ లో నమోదు చేసుకోవచ్చునని అన్నారు. అసలు మీ గురించి, నీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఏమంటున్నారో రహస్యంగా తెలుసుకోండని విజ్ఞప్తి చేశారు. మీ భాగస్వామి పక్షాలే మిమ్మల్ని కడిగేస్తున్నారని విమర్శించారు.. కనీసం దానికైనా సమాధానం చెప్పగలిగారా ..? ఇది కాదు పరిపాలన… తప్పుదారిలో వెళుతున్నామని మీ నేతలే మాట్లాడుకుంటున్నారని అన్నారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు..

Read Also: Devendra Fadnavis: బీజేపీ అధ్యక్షుడు ఎంపికపై ఫడ్నవిస్ కీలక వ్యాఖ్యలు

ఇక, మాజీ మంత్రి మేరుగు నాగార్జున మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం గురించి తెలిసిన ప్రతి వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూసి బాధపడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం వెర్రితలలు వేస్తుందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా పాలన జరుగుతుందని విమర్శించారు. కుట్రలు, కుతంత్రాలతో రాష్ట్రాన్ని పాలిస్తున్నారని.. రాష్ట్ర పగ్గాలను కొడుకు చేతిలో పెట్టి నడిపిస్తున్నారని అన్నారు. లేని లిక్కర్ కేసులు పెట్టి మా నాయకుల్ని అరెస్టు చేశారని మండిపడ్డారు.. సాధారణంగా కొండను తవ్వి ఎలుకను పట్టారు అంటారు.. కానీ, ఈ కేసులో ఎలుక కూడా లేదని అన్నారు. ఏపీలో గత ప్రభుత్వంలో లిక్కర్ స్కాం జరగలేదని వివరణ ఇచ్చారు. మద్యం విషయంలో ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అక్రమాలు చేసుకుంటున్నాయని ఆరోపించారు. గత ప్రభుత్వంలో వచ్చిన ఆదాయంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వంలో చాలా తక్కువ ఆదాయం వస్తుందని అన్నారు.. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజాస్వామ్యబద్ధంగా నడిచిందని అన్నారు. వ్యవసాయం, ఆరోగ్యం ఏ ఒక్క రంగంలో కూడా అభివృద్ధి కనిపించడం లేదన్నారు. మెడికల్ కళాశాల ప్రైవేటుపరం చేయడానికి తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు.. మా నాయకుడు ధైర్యంగా ఉన్నాడని, రానున్న రోజుల్లో మద్యం కేసు కూటమి నాయకులకు చెంపపెట్టు కానుందని అన్నారు. మేం ఎకౌంటబులిటీతో పని చేసాం… అదే మాకు శ్రీరామరక్ష అంటున్నారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున.

Exit mobile version