వారసత్వ రాజకీయాల్లోకి కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తూ డాక్టర్ బొత్స అనూష చీపురుపల్లి రాజకీయాల్లో ట్రెండ్ సెట్టర్‌గా మారుతున్నట్లు పార్టీ వర్గాలలో చర్చించుకుంటున్నారు. వైద్య వృత్తిలో ఉన్న అనుభవాన్ని, రాజకీయ కుటుంబ నేపథ్యాన్ని సమర్థంగా మేళవిస్తూ ఆమె ప్రజల్లోకి నేరుగా వెళ్లడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. తెల్లవారుజామునే గ్రామాల్లో పర్యటిస్తూ సమస్యలను అడిగి తెలుసుకోవడం, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ వంటి కార్యక్రమాలతో ఆమె యూత్ ఐకాన్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. తండ్రి నీడలో కాకుండా, తనకంటూ ప్రత్యేక గుర్తింపును నిర్మించుకునే ప్రయత్నంలో ఉన్న అనూష ప్రసంగ శైలి, సీనియర్లకు ఇచ్చే గౌరవం రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి.
వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కుమార్తెగా అనూష రాజకీయ ఎంట్రీకి గట్టి గ్రౌండ్ వర్క్ జరుగుతోందని పార్టీ వర్గాలు అంటున్నాయి. చీపురుపల్లి నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, కేడర్‌తో సన్నిహితంగా మెలగడం ఆమె భవిష్యత్ రాజకీయ పాత్రకు సంకేతంగా భావిస్తున్నారు. ధీరా ఫౌండేషన్, సత్య ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో నమ్మకం పెంచుకుంటున్న అనూష, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నారన్న ప్రచారం ఊపందుకుంది. మొత్తం మీద బొత్స కుటుంబం నుంచి రాజకీయ వారసత్వం కొనసాగడం ఖాయమన్న అంచనాలు చీపురుపల్లి రాజకీయాల్లో హీట్ పెంచుతున్నాయి.