Dharmana Prasad Rao: వికేంద్రీకరణ అంశంపై మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసమానత కారణంగా ఉత్తరాంధ్రలో ఉన్న సంస్థలన్నీ అభివృద్ధి చెందిన ప్రాంతాల వారివేనని వెల్లడించారు. ఒక ప్రాంతం నెగ్లెట్ కావడంతో తమ ప్రాంతం బీదవారిగా మారిందన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల వారు ప్రశాంతంగా నివసించే పరిస్థితులు ఏపీలో ఒక్క విశాఖలో మాత్రమే ఉన్నాయని మంత్రి ధర్మాన అభిప్రాయపడ్డారు. అమరావతి చుట్టూ ఉన్న భూములు కేవలం కొందరి చేతుల్లోనే ఉన్నాయి.. దీని వల్ల అమరావతిలో సాధారణ కుటుంబం ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉండదన్నారు. చాలా ఏళ్లుగా ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందక ఇక్కడి ప్రజల గుండెలు మండిపోతున్నాయని మంత్రి ధర్మాన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పాలకులు అసమానతలను సరిదిద్దాలని డిమాండ్ చేశారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. తమ గొంతు విని తమ ఆవేదనను గుర్తించాలని కోరారు.
Read Also: AP High Court: మేము కూడా ‘బిగ్‌బాస్’ చూస్తాం.. ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
రాజధాని విషయంలో సెక్షన్ 6 ప్రకారం వేసిన రాజ్యాంగబద్ధమైన సంస్థ ఇచ్చిన నివేదికను మాజీ సీఎం చంద్రబాబు బుట్టదాఖలు చేశారని మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. కమిటీ నివేదిక వదిలేసి చంద్రబాబు సొంత పార్టీ నేతలతో కమిటీ ఎందుకు వేశారో సమాధానం చెప్పాలన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా కమిటీ వేయవచ్చా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి సెంటర్‌లోనే రాజధాని ఉండాలని చెప్పడం కరెక్ట్ కాదని.. ఏ రాష్ట్ర రాజధాని సెంటర్‌లో ఉందో మేధావులు సమాధానం చెప్పాలన్నారు. ఉత్తరాంధ్రలో సెంటిమెంట్ లేదని చెబుతున్నారని.. మంగళగిరిలో లోకేష్ పోటీ చేసి ఓడిపోయారని.. సెంటిమెంట్ ఉందో లేదో ఆయనే చెప్పాలన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత మూడేళ్లలో రెండేళ్లు కోవిడ్ కారణంగా ఇబ్బంది పడ్డామని.. ఆదాయం లేకపోయినా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తున్నామని ధర్మాన చెప్పారు. మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని.. జిల్లాల పునర్ విభజన చేస్తున్నామని తెలిపారు. ఉద్దానం కిడ్నీ రోగులకు ఇన్నేళ్లలో ఏం చేశారని.. ఇప్పుడు తాము అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చిన 23 సంస్థలలో ఒక్క ప్రాజెక్ట్ కూడా శ్రీకాకుళం జిల్లాకు రాలేదని మంత్రి ధర్మాన విమర్శలు చేశారు. టీడీపీకి ఎల్లప్పుడూ పట్టం కట్టిన శ్రీకాకుళం జిల్లాకు ఆ పార్టీ ఏం చేసిందని నిలదీశారు. రెవెన్యూ మంత్రిగా విశాఖలో భూముల దోపిడీ జరగలేదని స్పష్టం చేశారు. తమ ప్రాంతపు వ్యక్తులత చేతితో తమ కళ్లు పొడవాలని చూస్తున్నారని ధర్మాన మండిపడ్డారు. తమ న్యాయమైన విశాఖ రాజధాని డిమాండ్‌కు వ్యతిరేకంగా ఎవరు మాటాడినా వ్యతిరేకిస్తామన్నారు.