రేపల్లె రైల్వే స్టేషన్ అత్యాచార ఘటనపై చంద్రబాబు చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్రంలో అగ్గి రాజేశాయి. ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, రాష్ట్రంలో శాంతి – భద్రతలు కూడా లోపించాయని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలకు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. జరిగిన సంఘటనల గురించి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని, ఒకట్రెండు సంఘటనలతో రాష్ట్రంలో శాంతి – భద్రతలులేవని వ్యాఖ్యానించడం కరెక్ట్ కాదన్నారు.
దిశా చట్టం లేకపోయినప్పటికీ, ఆ స్ఫూర్తితో తాము జరుగుతున్న ఘటనలపై విచారణ చేస్తున్నామని అన్నారు. కొన్ని కేసుల్లో 10 రోజుల్లోనే విచారణ, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం, ట్రయల్స్ కూడా జరురుగుతున్నాయన్నారు. దిశా యాప్‌ద్వారా కోటి 24 లక్షల మంది మహిళలు పోలీసులతో ప్రత్యక్షంగా సంప్రదించడానికి అవకాశం కల్పించామని, కష్టంలో ఉన్నప్పుడు 5, 10 నిమిషాల్లోనే పోలీసులు స్పాట్‌కు చేరుకుంటున్నారన్నారు. దిశా యాప్ ద్వారా పోలీసింగ్ ప్రమాణాల్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
రాష్ట్రంలో గంజాయిను కట్టడి చేయటానికి చాలా చర్యలు తీసుకుంటున్నారు. పొరుగు రాష్ట్రాల్లోను ఇలాంటి చర్యలు జరగాలని చెప్పిన డీజీపీ.. ఇతర రాష్ట్రాల డీజీలతో ఈరోజు సమావేశాన్ని నిర్వహించామని వెల్లడించారు. మరోవైపు.. హోం శాఖ మంత్రి తానేటి సునీత మాట్లాడుతూ, బాధితులకి అండగా నిలవాల్సిన టైంలో టీడీపీ రాజకీయం చేయడం బాధిస్తోందన్నారు. గత ప్రభుత్వంలో కంటే తమ ప్రభుత్వంలోనే విచారణ వేగంగా జరుగుతోందని, దిశా యాప్ ద్వారా 900 మంది మహిళలు తమని తాము రక్షించుకోగలిగారన్నారు.