ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగతున్నాయి. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ పై టీడీపీ, వైసీపీ నేతలు విమర్శలు చేసుకుంటునే.. మరో వైపు గత టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. వారి మాటలపై వైసీపీ నేతలు ఘాటుగా స్పందిస్తూ విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వర రావు పలు వ్యాఖ్యలు చేశారు.
జగన్ అధికారంలోకి వచ్చి 29 నెలలు గడిచినా ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో 23 ప్రాజెక్టులు పూర్తి చేశామని, అంతేకాకుండా 13 ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. సాగునీటి ప్రాజెక్ట్‌లకు రూ.63 కోట్లు ఖర్చు చేశామని చెప్పిన మంత్రి అనిల్.. ఎక్కడెక్కడ ఖర్చు చేశారో.. ఏ ప్రాజెక్ట్‌కు ఎంత ఖర్చు చేశారో..? చెప్పాలంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.