Polavaram Project: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టుపై ఇవాళ కీలక సమావేశం జరగనుంది.. పోలవరం బ్యాక్ వాటర్ ముంపు ప్రభావంపై కేంద్ర జలశక్తి శాఖ ఈ సమావేశం నిర్వహిస్తోంది.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల అధికారులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.. సుప్రీంకోర్టు ఆదేశాలతో పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావంపై గతేడాది సెప్టెంబర్ 29న కేంద్ర జలశక్తి శాఖ ముఖ్య కార్యదర్శుల స్థాయిలో సమావేశం నిర్వహించింది. ఆ తర్వాత సాంకేతికపరమైన అంశాలపై ముంపు ప్రభావిత రాష్ట్రాలతో చర్చలు, సంప్రదింపుల కోసం సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది. పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ప్రభావంపై తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలు కేంద్రానికి లేఖ రాసిన విషయం తెలసిందే కాగా.. సీడబ్ల్యూసీ దీనిపై సమాధానం ఇచ్చింది.. ఇక, ఈ సమాధానాలపై ఏమైనా అభ్యంతరాలుంటే 20లోగా పంపించాలని ఆయా రాష్ట్రాలను సీడబ్ల్యూసీ కోరింది. వచ్చే నెల 15వ తేదీన పోలవరం ముంపుపై సుప్రీంకోర్టులో కేసు విచారణ నేపథ్యంలో ఇవాళ నిర్వహించనున్న సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది..
అయితే, 10 అంశాలతో కూడిన లేఖను మ్యాప్‌లు, ఇతర ఆధారాలతో సహా తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి పంపినట్లు తెలుస్తోంది.. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి ఈఎన్‌సీ మురళీధర్ హాజరుకానున్నారు. పోలవరం వల్ల ముంపుపై తెలంగాణ లేవనెత్తిన అంశాలను ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేంద్ర జలసంఘం తిరస్కరిస్తున్న నేపథ్యంలో 10 అంశాలతో కూడిన లేఖను మ్యాప్‌లు, ఇతర ఆధారాలతో సహా పంపినట్లు సంబంధితవర్గాలు చెబుతున్నాయి.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ నేతృత్వంలో తెలంగాణ, ఏపీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల అభిప్రాయాలను సీడబ్ల్యూసీ నమోదు చేస్తోంది. ఇక, మణుగూరు భారజల కర్మాగారం పోలవరం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టంతో పోల్చితే ఎక్కువ ఎత్తులో ఉందని, ఇది 64 నుంచి 85 మీటర్ల మట్టంలో ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ పేర్కొనగా.. కర్మాగారం జనరల్ మేనేజర్ 2019లో రాసిన లేఖ ప్రకారం క్రిటికల్ ఆపరేషన్ లెవల్ 60 మీటర్లుగా ఉంది. నీటిపారుదలశాఖ అధ్యయనం ప్రకారం 58 నుంచి 63 మీటర్లు ఉంది. మరోవైపు.. 2010లో ఆమోదించిన పోలవరం డీపీఆర్ ప్రకారం నెల్లిపాక నుంచి భద్రాచలం, భద్రాచలం ఎగువభాగాన ఎడమవైపు 3 కిలోమీటర్లు, కిన్నెరసాని కలిసేచోట నుంచి ఎగువన 3 కిలోమీటర్లు, భద్రాచలం రోడ్డు బ్రిడ్జి వరకు కుడివైపు, బూర్గంపాడు టౌన్, గుమ్ములూరు-రెడ్డిపాలెం, సారపాక గ్రామాలు మునిగిపోకుండా చూడాలి.. మొత్తంగా ఇవాళ్టి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.