తనకు నగరి నియోజకవర్గం నుంచి పోటీచేసే ఆలోచనే లేదని స్పష్టం చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. గతంలో తనకు అవకాశాలు వచ్చినా.. పార్టీ సేవకు అంకితం అయ్యాయని గుర్తుచేసుకున్నారు.. నాకు రాజ్యసభ ఎంపీగా అవకాశం వచ్చినా వదులుకున్నానని.. పార్టీ సేవకే అంకితం అయ్యా.. అజీజ్ పాషాకు అవకాశం ఇచ్చామని తెలిపారు.. ఇక, తాను ఎక్కడ పోటీచేసినా పార్టీ అవసరాల కోసమే చేశానని.. కానీ, ఏ ఎన్నికల్లోనూ ఒక్క రూపాయి ఖర్చు చేయలేదన్నారు నారాయణ.. తాను 50 ఏళ్లగా రాజకీయ జీవితంలో ఉన్నాను.. అసలు నగరిలో పోటీ చేసే ఆలోచన లేనే లేదన్నారు.
కాగా, గతంలో చాలా ఎన్నికల్లో బరిలో నిలిచారు నారాయణ.. 1999 తిరుపతి ఎమ్మెల్యేగా.. అదే తిరుపతి మున్సిపల్ చైర్మన్‌గా కూడా గతంలో పోటీ చేశారు. 2014 ఎన్నికల్లో తెలంగాణలోని ఖమ్మం నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లోనైనా అసెంబ్లీలో కాలుపెట్టి అధ్యక్షా అనాలని కలలు కంటున్నారని గుసగుసలు వినిపించాయి.. తన సొంత ఊరున్న నగరి నియోజకవర్గంపై నారాయణ కన్నేశారనే టాక్ చిత్తూరు పొలిటికల్ సర్కిల్స్ ఓ రెంజ్‌లో నడించింది.. నగరిలో రోజా వైసీపీ నుంచి పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. మూడోసారి ఆమెకు అవకాశం ఇవ్వకుండా తాను ఎంటర్ అవ్వాలనే ఆలోచనలో నారాయణ ఉన్నారని ప్రచారం సాగింది.. కానీ, తనకు అలాంటి ఆలోచనే లేదని చెబుతున్నారు. మరి ఎన్నికలు వచ్చేనాటికి ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.