Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి లేటెస్టుగా నటిస్తున్న మూవీ గాడ్ ఫాదర్. ఈ మూవీలో ఓ డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నా.. తన నుంచి రాజకీయాలు దూరంగా లేవని గాడ్ ఫాదర్ సినిమాలో చిరు చెప్పిన డైలాగ్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చిరంజీవికి కొత్త ఐడీ కార్డు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా మెగాస్టార్ చిరంజీవిని పీసీసీ డెలిగేట్‌గా నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీసీసీ డెలిగేట్‌గా చిరును గుర్తిస్తూ కాంగ్రెస్ పార్టీ కొత్త ఐడీ కార్డును ప్రింట్ చేయించింది. 2027 వరకు చిరంజీవిని పీసీసీ డెలిగేట్‌గా గుర్తిస్తున్నట్లు ఐడీ కార్డులో పేర్కొంది.
Read Also:CM Jagan: చంద్రబాబు లాంటి నేతల వల్లే మేనిఫెస్టోకు విలువ ఉండటం లేదు
త్వరలోనే జరగనున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నికల్లో ఓటు వేసే క్రమంలోనే చిరంజీవికి ఐడీ కార్డును విడుదల చేసినట్టు తెలుస్తోంది. రాజకీయాల గురించి చిరంజీవి మాట్లాడిన డైలాగ్ వచ్చిన 24 గంటల్లోపే ఆయనకు కాంగ్రెస్ పార్టీ పదవి కట్టబెట్టడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గతంలో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత చిరంజీవి రాజ్యసభ సభ్యుడిగా సేవలు అందించారు. అనంతరం ఆయన యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలను నిర్వర్తించారు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం ఆయన రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. పూర్తిగా సినిమాలపైనే దృష్టిని సారించారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్‌లతో చిరంజీవికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఇటీవల వైసీపీ సైతం చిరంజీవిని ఆకాశానికి ఎత్తేస్తోంది. మరోవైపు జనసేన పార్టీ చిరు సపోర్టు తమకే ఉంటుందని అభిప్రాయపడుతోంది.