రాష్ట్రా రూపురేఖలే కాదు.. పోర్టులు ఉన్న ప్రాంతాల రూపురేఖలు త్వరలోనే మారబోతున్నాయని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. రామాయపట్నం పోర్టు పనులకు భూమిపూజ చేసిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు.. చెన్నై అయినా, విశాఖ అయినా, ముంబై అయినా మహానగరంగా ఎదిగాయంటే అక్కడ పోర్టులు ఉన్నాయని గుర్తుచేసిన ఆయన.. పోర్టు రావడం వల్ల ఉద్యోగావకాశాలు వస్తాయి, ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయి, పోర్టు వల్ల ట్రాన్స్‌పోర్టు ఖర్చుకూడా బాగా తగ్గుతుంది.. రాష్ట్రానికే కాదు, ఈప్రాంతం రూపురేఖలు మారుతాయని వెల్లడించారు.. రాష్ట్రంలో ఎక్కడ ఏ పరిశ్రమల వచ్చినా 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని చట్టం తీసుకు వచ్చామని.. పోర్టులోకాని, దీనికి అనుబంధంగా ఉన్న, వచ్చే పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే వస్తాయని స్పష్టం చేశారు.. మన దగ్గర దాదాపు 6 పోర్టులు ఉన్నాయి.. కృష్ణపట్నం, కాకినాడలో 2, విశాఖపట్నం, గంగవరం తదితర పోర్టుల ద్వారా ఎగుమతులు, దిగుమతులు కొనసాగుతున్నాయి.. దీనికి మరో 4 పోర్టులు అదనంగా వస్తున్నాయని.. భావనపాడు, కాకినాడ గేట్‌వే, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులను నిర్మిస్తున్నామని తెలిపారు.
ఇక, ఈ పోర్టుల ద్వారా మరో 100 మిలియన్ టన్నుల సరుకు రవాణా సామర్థ్యం వస్తుందని పేర్కొన్నారు సీఎం వైఎస్ జగన్.. దీంతో పాటు 9 ఫిషింగ్ హార్బర్లు కూడా కడుతున్నాం.. వీటి నిర్మాణాలు వేగవంతంగా కొనసాగుతున్నాయి.. మరో 2 నెలల్లో మిగిలిన పోర్టులకు భూమి పూజ చేస్తామని తెలిపారు.. 9 ఫిషింగ్ హార్బర్లు, 4 పోర్టులతో మౌలిక సదుపాయాలు ఊపందుకుంటున్నాయి.. 9 ఫిషింగ్ హార్బర్ల ద్వారా దాదాపు లక్షమందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు.. దీంతో, గుజరాత్ లాంటి రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరంలేదన్నారు. ఒక్కో పోర్టులో నేరుగా వచ్చే ఉద్యోగాలు 3–4వేలు ఉంటాయని.. పరోక్షంగా వచ్చే ఉద్యోగాలు సంగతి చెప్పనవసరంలేదు.. అన్ని పోర్టుల ద్వారా లక్షలాది ఉద్యోగాలు వస్తాయని, ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని వెల్లడించారు.
చంద్రబాబు డ్రామా చేశారు..
మరోవైపు, చంద్రబాబుపై మండిపడ్డారు సీఎం వైఎస్ జగన్.. 2019 ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగాయి.. 2019 ఫిబ్రవరిలో శంకుస్థాపన అంటూ డ్రామా చేశారని దుయ్యబట్టిన ఆయన.. డీపీఆర్ లేదు, భూ సేకరణ కూడా చేయలేదు.. అయినా, ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు.. 5 సార్లు ఏమీ చేయకుండా 2 నెలల ముందు కొబ్బరికాయ కొట్టే పని చేశారు.. ఇంతకన్నా అన్యాయం, మోసం ఏమైనా ఉంటుందా? అని ప్రశ్నించారు.. గత పాలనలో ఇలాంటివే చూశాం.. రుణమాఫీ అంటూ రైతులకు, అక్క చెల్లెమ్మలను మోసం చేశారు.. చదవుకుంటున్న పిల్లలన్నీ కూడా మోసం చేశారు, చివరకు ప్రాంతాల పేరిట మోసాలు చేశారని ఫైర్ అయ్యారు వైఎస్ జగన్.
పూర్తిగా భూమిని సేకరించాం
రామాయపట్నం పోర్టు పనుల కోసం ఇవాళ పూర్తిగా భూమిని సేకరించాం, రూ.3,700కోట్లతో పనులు కూడా మొదలుపెట్టాం.. మొదటి దశలో 4 బెర్తులు అందుబాటులోకి వస్తాయి.. మరో 6 బెర్తులు కూడా ఇక్కడే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.. ఒక్కో బెర్తుకు రూ.200 కోట్లు ఖర్చు చేస్తే చాలు.. ఏకంగా 50 మిలియన్ టన్నుల కార్గోను కూడా రవాణా చేయవచ్చన్న ఆయన.. పోర్టు వల్ల మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను.. పోర్టు రావడానికి సహకరించిన గ్రామాలకు నా కృతజ్ఞతలు అన్నారు.. నిండు మనస్సుతో వారికి రెండు చేతులు జోడించి పేరుపేరునా కృతజ్ఞతలు చెప్తున్నాను.. మీరు భూములిచ్చి పోర్టు వచ్చేందుకు దోహదపడ్డారు.. చరిత్రలో సువర్ణాధ్యాయానికి మీరు తెరలేపారు.. మన గ్రామాల నుంచి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి వస్తుందన్నారు. పోర్టుకు అనుసంధానంగా ఒక పారిశ్రామిక కారిడర్‌ను తీసుకురావాలని ఎమ్మెల్యే ప్రతాప్ అడుగుతున్నారు.. రాబోయే రోజుల్లో అడుగులు ముందుకేస్తామన్న ఆయన.. పోర్టు కారణంగా కందుకూరు టౌన్ ఒక హబ్‌గా తయారవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కందుకూరు బైపాస్ రోడ్డు సేకరణకు డబ్బు మంజూరుచేస్తున్నాం.. కందుకూరు మున్సిపాల్టీలో అభివృద్ధికీ తగిన సహాయం అందిస్తాం.. రాళ్లపాడు లెఫ్ట్‌కెనాల్ విస్తరణకు ని«ధులు మంజూరుకూడా చేస్తున్నాం అని వెల్లడించారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.