తెలంగాణలో రాజకీయాలు వేడెక్కినట్లు కనిపిస్తున్నాయి. ఇటీవల కరీంనగర్‌లో బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్ తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. బండి సంజయ్‌ను అరెస్ట్ చేయడంతో జాతీయ స్థాయి నేతలు తెలంగాణకు తరలివచ్చారు. అంతేకాకుండా నేడు బండి సంజయ్‌కి ఏకంగా ప్రధాని మోడీ ఫోన్ చేసి దాడి, అరెస్ట్‌లపై ఆరా తీశారు. తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ ప్రత్యామ్నాయ పార్టీగా ఎదుగుతోందనే భావన కూడా తెలంగాణ ప్రజల్లో బలపడుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ లెఫ్ట్ నేతలతో వరుస భేటీలు అవుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు సీఎం కేసీఆర్ సీపీఎం నేతలు ఏచూరి సీతారాంతో పాటు ప్రకాష్ కారత్‌తో చర్చలు జరిపారు. అంతేకాకుండా అనంతరం సీపీఐ నేత డి.రాజాతో భేటీ అయ్యారు. అయితే ఈ భేటీల్లో బీజేపీ వ్యతిరేక కార్యచరణపై చర్చలు జరినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా త్వరలోనే మరోసారి లెఫ్ట్ నేతలతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నట్లు సమాచారం.