CM Jagan: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం మూలా నక్షత్రం కావడంతో దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు భారీ స్థాయిలో బారులు తీరారు. మూలా నక్షత్రం ప్రత్యేక రోజు కావడంతో ఏపీ సీఎం జగన్ సంప్రదాయ దుస్తుల్లో ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధికి వచ్చారు. సీఎం రాక నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భారీ భద్రత ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించారు. వేదమంత్రోచ్ఛారణల నడుమ పట్టువస్త్రాలతో పాటు పసుపు, కుంకుమలు కూడా అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు సీఎం జగన్కు వేదాశీర్వచనం అందించారు. అమ్మవారి చిత్రపటంతో పాటు తీర్థప్రసాదాలు అందజేశారు. సీఎం జగనుకు దుర్గ గుడి స్థానాచార్యుడు శివప్రసాద్ పరివేష్టం కట్టారు. అంతకుముందు దుర్గగుడిలో సీఎం జగన్కు వేదపండితులు, దేవస్థానం అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సీఎంకు మంత్రులు కొట్టు సత్యనారాయణ, తానేటి వనిత, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని తదితరులు కూడా స్వాగతం పలికారు.
Read Also:climbed Tirumala Steps with his wife: భార్యను ఎత్తుకొని తిరుమల కొండెక్కిన సత్తిబాబు
కాగా మూలా నక్షత్రం సందర్భంగా సంప్రదాయ పద్ధతిలో సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారని మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. గతంలో గంటల తరబడి దర్శనాలు నిలిపి వేసేవారు అని.. ఈ ఏడాది భక్తులు ఎవరూ ఇబ్బంది పడకుండా తనకు దర్శనం కల్పించాలని సీఎం ఆదేశించారన్నారు. కలెక్టర్, సీపీ, ఈవో, రెవెన్యూ శాఖల సహకారంతో ఉత్సవాలు సజావుగా సాగుతున్నాయన్నారు. కేవలం అరగంట సమయం మాత్రమే క్యూ లైన్లు నిలిపివేయడం జరిగిందన్నారు. సీఎం జగన్ దర్శనం అనంతరం భక్తులకు దర్శనం కల్పించామన్నారు. సాయంత్రం నాలుగు గంటల సమయానికి 2 లక్షల 30 వేల మంది అమ్మవారిని దర్శించుకున్నట్లు మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. దేవాదాయ శాఖ మంత్రిగా తాను కూడా ముఖ మండపం ద్వారానే అమ్మవారిని దర్శించుకున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఏటా ఇదే మాదిరిగా ఏర్పాట్లు చేస్తామన్నారు.