కార్యేషు దాసి.. కరణేషు మంత్రి.. భోజ్యేషు మాత… శయనేషు రంభ… అని భార్య గురించి చెబుతుంటారు. అదే భర్త అయితే భరించేవాడు అంటుంటారు. అదెంతవరకూ నిజమో కానీ.. ఆ గోదారి సత్తిబాబు మాత్రం.. భర్త అంటే భార్యను మోసేవాడు అని నిరూపించాడు. అది కూడా కొత్తగా పెళ్ళి అయిన వ్యక్తి కాదు.. ఏకంగా ఇరవై నాలుగు వసంతాలు అయింది. పెళ్ళయిన తర్వాత 10.. 15 ఏళ్లకు భార్యపై భర్తకు, భర్తపై భార్యకు వివిధ కారణాల వల్ల ప్రేమలు తగ్గిపోతాయి. భార్య ఏం అడిగినా చూద్దాంలే అని భర్త… భర్త అడిగినదానికి ముభావంగా భార్య సమాధానాలు మనం చూస్తుంటాం. కానీ ఈ గోదారి సత్తిబాబు మాత్రం భార్య అడిగినదానిని కాదనలేకపోయాడు.
Read Also: Minister Chelluboina: తెలంగాణ మంత్రిపై ఏపీ మంత్రి ఫైర్.. అహంకారంతో మాట్లాడటం సరికాదు
గోదారోళ్ళు అంటే మమకారాలు, ఎటకారాలకు కేరాఫ్ అడ్రస్. భక్తి, ప్రేమాభిమానాలకు పెట్టింది పేరు. ఏది చేసినా గోదారంత విశాలంగా వుంటుంది. ఊరికే మాటలు చెప్పడం కాదు చేతలతో చూపిస్తుంటారు. ఇదిగో అలాంటి దంపతులే వీరు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంకకు చెందిన లారీ ట్రాన్స్‌పోర్ట్ యజమాని వరదా వీర వెంకట సత్యనారాయణ(సత్తిబాబు) లావణ్య దంపతులు అన్యోన్యతకు పెట్టింది పేరు. ఏడుకొండల స్వామి దర్శనానికి తిరుపతి వెళ్లారు. గోదావరి జిల్లాల వారు అధికంగా కాలినడకనే ఏడు కొండలు ఎక్కుతామని మొక్కుకుంటారు. వీరు కూడా మెట్లు ఎక్కుతున్నారు. వేగంగా మెట్లు ఎక్కుతున్న సత్తిబాబును చూసి భార్య లావణ్య భార్య కోరిక కోరింది. మీరు ఎక్కడం కాదు దమ్ముంటే నన్ను ఎత్తుకుని ఎక్కమని సరదాగా సవాల్ చేసింది.
అలాంటి సవాల్ విసిరితే.. నవ్వి ఊరుకుంటారు కొందరు. అదేదో సినిమాలో హీరో గోపీచంద్ హీరోయిన్ ని వందల మెట్లు ఎక్కి దైవదర్శనానికి తీసికెళతాడు. భార్య సవాల్ ని కూడా సత్తిబాబు ఇజ్జత్ కా సవాల్ గా స్వీకరించాడు. భార్యను భుజాలపైకి ఎక్కించుకుని మెట్లు ఎక్కడం మొదలు పెట్టారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 70 మెట్లు ఎక్కారు. అలా ఆ జంట వెళ్తుంటే ఫోటోలు,వీడియోలు తీయడానికి మిగిలిన భక్తులు పోటీపడ్డారు.
పెళ్లైన కొత్తలో ఇలాంటి ప్రేమలు సర్వసాధారణమే అని అంతా అనుకున్నారు. వీరికి పెళ్ళి జరిగి ఎన్నేళ్ళయిందో తెలిసి అక్కడివారు షాక్ అయ్యారు. వీరి వివాహం 1998లో జరిగింది. అంటే వీరి ఏడడుగుల బంధానికి ఇరవై నాలుగేళ్లు. మరో విచిత్రమైన విషయం చెప్పమంటారా… ! వీరి ఇద్దరమ్మాయిలకూ పెళ్లిళ్లు కూడా చేశారు. తాత,అమ్మమ్మలు కూడా అయిపోయారు. వీళ్ళ పెద్ద అల్లుడు చందు మంచి సాప్ట్ వేర్ ఇంజనీర్. మంచి ఉద్యోగం వస్తే పుట్టింటి,అత్తింటి వారందరనీ తిరుమల తీసుకొస్తానని వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నారు.ఉద్యోగం రావడంతో బస్సులో నలభై మందిని తిరుపతి తీసుకెళ్లి మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంగానే మన సత్తిబాబు ఈ సాహసానికి పూనుకున్నారు. వీడు మామూలోడు కాదు అంటూ అక్కడ కామెంట్లు వినబడ్డాయి.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తొందరపడి ఈ సాహసానికి ట్రైచేయకండి. మీ నడుం జాగ్రత్త.
Read Also: Mallikarjun Kharge: ఎన్నిక ఏకగ్రీవం అయితే మంచిదని శశిథరూర్‌కు చెప్పాను