ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం పల్నాడు జిల్లా వినుకొండలో పర్యటించనున్నారు. జగనన్న చేదోడు పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.40 గంటలకు వినుకొండ చేరుకుంటారు. ఉదయం 11.05 నుంచి 12.20 వరకు వినుకొండ వెల్లటూరు రోడ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం జగనన్న చేదోడు పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1.05 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 1.45 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3,30,145 మంది అర్హులైన రజక, నాయీబ్రాహ్మణ, దర్జీలకు 330.15 కోట్ల ఆర్ధిక సాయాన్ని విడుదల చేయనున్నారు. షాపులున్న రజకులకు, నాయి బ్రాహ్మణులకు, టైలర్లకు ఈ పథకం ద్వారా రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. 330.15 కోట్ల ఆర్ధిక సాయంలో.. 1,67,951 షాపులున్న టైలర్లకు రూ.167.95 కోట్లు, 1,14,661 షాపులున్న రజకులకు రూ.114.67 కోట్ల లబ్ధి, 47,533 షాపులున్న నాయీబ్రాహ్మణులకు రూ.47.53 కోట్ల లబ్ధి చేకూరనుందని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు పేర్కొన్నారు.
Read Also: Monday Siva Pooja Bhakthi Tv Special Live: సోమవారం ఈ పూజలు చేస్తే శివుడు ప్రసన్నం అవుతాడు
ఇదిలా ఉంటే.. సీఎం పర్యటన పేరుతో రాష్ట్రంలో చెట్ల నరికివేత కొనసాగడంపై నిరసన వ్యక్తం అవుతోంది. గతంలో గుంటూరు, విశాఖ నగరంలో చెట్ల నరికివేతపై తీవ్ర విమర్శలు వచ్చినా.. అధికారులు స్పందించడం లేదు. ప్రత్యామ్నాయ మార్గాలపై కూడా దృష్టి పెట్టడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. పల్నాడు జిల్లాలో దాదాపు వంద పచ్చని చెట్లు గొడ్డలి వేటుకు మోడువారాయి. సీఎం జగన్ మోహన్ రెడ్డి భద్రత పేరుతో ఆర్టీసీ బస్టాండు రోడ్డులో డివైడర్ మధ్యలో ఏపుగా పెరిగిన పచ్చని చెట్లను అడ్డంగా నరికేశారు. భద్రత పేరుతో అధికారులు చెట్లను శనివారం రాత్రి రంపంతో కోసేశారు. సీఎం హెలిపాడ్ ల్యాండింగ్ జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో సుమారు 50 చెట్లు, సభ ప్రాంగణానికి వెళ్లే మార్గంలో సుమారు 50కి పైగా చెట్లను ఇలా నరికేశారు. భద్రత సిబ్బంది సూచనల మేరకు తొలగించామని అధికారులు తెలిపారు.
Read Also: Sharukh Khan: బాల్కనీ కొచ్చిన బాలీవుడ్ బాద్ షా.. ఫ్యాన్స్ను చూసి డ్యాన్స్