అసని తుఫాన్ మీద సీఎం జగన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సహాయక చర్యలపై సమీక్ష జరిపిన ఆయన.. తుపాను నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. తుపాను నేపథ్యంలో అలెర్ట్‌గా ఉండాలని.. తుఫాను తీరం వెంబడి ప్రయాణిస్తోంది కాబట్టి తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారుల్ని సూచించారు.
తుఫాను బలహీనపడటం ఊరటనిచ్చే అంశమని చెప్పిన సీఎం జగన్.. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఎక్కడా నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని, ప్రజలకు ఎలాంటి ముప్పు రాకుండా చూడాలని, ముంపు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అన్నారు. అవసరమైన చోట సహాయ పునరావాస శిబిరాలను తెరవాలని, అందులో మంచి సౌకర్యాల్ని ఏర్పాటు చేయాలని, కమ్యూనికేషన్ వ్యవస్థకు అంతరాయం ఏర్పడితే వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. తుపాను బాధితులకు ఏమైనా కష్టమొస్తే వెంటనే ఆదుకోవాలని, పరిహారం ఇచ్చే విషయంలో ఎలాంటి సంకోచాలు పెట్టుకోవదని సీఎం అన్నారు.
ఇదిలావుండగా.. ప్రస్తుతం అసని తుఫాన్ 6 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. కాకినాడ నుంచి విశాఖ మీదుగా మళ్ళీ, ఆ తర్వాత సముద్రంలోకి వెళ్ళనుందని అధికారులు చెప్తున్నారు. తీరంలో గంటకు 55 – 75 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయని.. తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని అంటున్నారు. రేపు ఉదయానికి తుఫాన్ తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందన్నారు. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, విశాఖ జిల్లాలకు రెడ్ అలెర్ట్.. విజయనగరం, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు.