ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాల విభజన జరిగిందన్నారు ముఖ్యమంత్రి జగన్. ఈ రోజు నుంచి 26 జిల్లాల ఆంధ్రరాష్ట్రంగా రూపు మారుతోందని, కొత్తగా ఏర్పడిన 13 జిల్లాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగానికి శుభాకాంక్షలు తెలిపారు. పరిపాలన సౌలభ్యాన్ని, వికేంద్రీకరణ, గిరి బిడ్డలు, వాగ్గేయ కారులు వంటి అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాల పేర్లు పెట్టామన్నారు.
గతంలో ఉన్న 13 జిల్లాల కేంద్రాలను అలాగే కాపాడాం. 1970 మార్చిలో ప్రకాశం జిల్లా, 1979 జూన్ లో విజయనగరం జిల్లా ఏర్పడ్డాయి. ఈ రెండే గత 70 ఏళ్ల చరిత్రలో ఏర్పడిన కొత్త జిల్లాలు. దేశంలో 727 జిల్లాలు వున్నాయన్నారు సీఎం జగన్. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ లో 70 జిల్లాలు వున్నాయి. అతితక్కువగా గోవాలో కేవలం రెండు జిల్లాలే వున్నాయని చెప్పారు జగన్.

Cm Jagan
అతి చిన్న రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ లో కూడా 25 జిల్లాలు ఉన్నాయి. 2011లో చివరి జనాభా ప్రకారం ఒక్కో రాష్ట్రంలో సగటు జిల్లా జనాభా 38 లక్షల 15 వేలు వుండేదన్నారు. దేశంలో సగటు జిల్లా జనాభా మనదే అన్నారు. ప్రతి జిల్లాలో 70 వరకు ప్రభుత్వ శాఖలు, 120 కార్యాలయాలు ఉన్నాయి. కొత్త జిల్లాల్లో ముఖ్యమైన కార్యాలయాలు మాత్రమే నడవనున్నాయి. సైనిక సంక్షేమం, ఉద్యానం తదితర తక్కువ సిబ్బంది ఉండే శాఖల ఉద్యోగులు పాత జిల్లాల్లోనే ఉంటూ విధులు నిర్వర్తించాల్సి వుంటుంది. 9.05 – 9.45 నిమిషాల మధ్య కొత్త జిల్లాల ప్రారంభోత్సవం నిర్వహించారు. క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్. ఈ కార్యక్రమంలో సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆయా జిల్లాల్లో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైసీపీ నేతలు పాల్గొన్నారు.
https://ntvtelugu.com/cpi-ramakrishna-slams-cm-jagan-on-new-districts-openings/