క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ జగనన్న తోడు పథకం కింద వడ్డీలేని రుణాలను జమచేశారు. ఈ నేపథ్యంలో లబ్దిదారుల ఖాతాల్లో నగదును సీఎం జగన్ జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోజుకు రూ.10ల వడ్డీకూడా చెల్లించాల్సిన పరిస్థితులు చిరువ్యాపారులకు ఉండేవని, ఇవాళ రూ.510.46 కోట్ల రుణాలు ఇవ్వడమే కాకుండా, రూ.16.16 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌గా ఇస్తున్నామన్నారు. మొత్తంగా ఇవాళ రూ.526.62 కోట్లను ఇస్తున్నామని, గొప్ప వ్యవస్థను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. తీసుకున్న రుణాలు తిరిగి కడితే.. బ్యాంకులు ఖచ్చితంగా రుణాలు ఇస్తాయని, ఈ పథకంలో లబ్ధిదారులకు ప్రభుత్వపరంగా ఇతర పథకాలు కూడా వర్తిస్తున్నాయన్నారు. వీటితో వీరి జీవితాల్లో మార్పులు రావాలని మనసారా కోరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు.
చేతివృత్తుల మీద, హస్తకళలమీద బ్రతుకుతున్నవారికి కూడా జగనన్నతోడు వర్తిస్తోందని, ఎవరికైనా రాకపోయినా కంగారుపడాల్సిన అవసరంలేదని, ఎలా ఇవ్వాలని ఆలోచించే ప్రభుత్వం కానీ.. ఎలా ఇవ్వకూడదు అంటూ ఎగ్గొట్టే ప్రభుత్వం కాదిది ఆయన అన్నారు. వాలంటీర్లను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చని, లేదా వెబ్‌సైట్‌లో కూడా చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు. చిరు వ్యాపారులకు స్మార్ట్ కార్డులు కూడా ఇవ్వటం జరిగిందని, గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయాల వ్యవస్థ.. ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటుందన ఆయన వెల్లడించారు.
బ్యాంకు ఖాతా తెరిచిన నాటి నుంచి… రుణం మంజూరు అయ్యేంతవరకూ అండగా ఉంటారని, సందేహాలు ఉంటే.. 08912890525కు కాల్‌చేయొచ్చునని ఆయన తెలిపారు. కోవిడ్ కారణంగా చిరువ్యాపారులు బాగా దెబ్బతిన్నారని సర్వేల్లో చూశామన్నారు. అలాంటి అవస్థలనుంచి మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరి నిరుపేద కుటుంబాన్ని కాపాడేందుకు మన అందరి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేసిందని, డీబీటీ పద్ధతిలో ప్రతి రూపాయికూడా లంచాలకు, వివక్షకు తావులేకుండా నేరుగా రూ. 1.29లక్షల కోట్లు అందించామన్నారు.