NTV Telugu Site icon

Chandrababu: మద్యం ధరలు, ఇసుక సరఫరాపై సమీక్షలో చంద్రబాబు వార్నింగ్

Chandrababu

Chandrababu

మద్యం షాపుల్లో ఎవరైనా ఎంఆర్‌పీ ధరలకు మించి ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా ఉపేక్షించవద్దని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అమరావతిలో మద్యం ధరలు, ఇసుక లభ్యత, సరఫరాపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త మద్యం పాలసీ అమలు విధానాన్ని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. అనంతరం మద్యం ధరల విషయంలో అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

ఇది కూడా చదవండి: PKL: హమ్మయ్య… గెలిచారు… తెలుగు టైటాన్స్ విజయం

ఎంఆర్పీకి మంచి మద్యం అమ్మినా, బెల్టు షాపులు ప్రోత్సహించినా మొదటి సారి రూ.5లక్షల జరిమానా విధించాలని.. రెండోసారి తప్పు చేస్తే సదరు షాపు లైసెన్స్ రద్దు చేయాలని ఆదేశించారు. ఈ రెండు విధానాలపై అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. ఇక ఇతర ప్రాంతాల నుంచి వచ్చే మద్యంపై కఠినంగా ఉండాలని సూచించారు. ప్రతి షాపులో సీసీ కెమెరాలు ఉండాలని.. ఫిర్యాదుల కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయాలని చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. ఈ రెండు వ్యవస్థల పర్యవేక్షణకు సెంట్రల్ మానిటరింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ప్రతి షాపు దగ్గర మద్యం ధరల పట్టిక తప్పకుండా ఉండాలన్నారు. మద్యం షాపుల దగ్గర ఆకస్మిక తనిఖీలు, మద్యం అక్రమ నిల్వలపై దాడులు చేయాలన్నారు.

ఇది కూడా చదవండి: Minister Achchennaidu: బిందు సేద్యంలో రాష్ట్రం ఆదర్శంగా నిలవాలి..

ఇసుక సరఫరాపై..
అనంతరం ఇసుక లభ్యత, సరఫరా అంశాలపై కూడా తాజా పరిస్థితిని చంద్రబాబుకు అధికారులు వివరించారు. ఇసుక లభ్యత పెంచాలని.. అన్ని రీచ్‌ ల నుంచి ఇసుక సులభంగా తీసుకువెళ్లేందుకు అవసరమైన ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. పొరుగు రాష్ట్రాలకు ఒక్క లారీ ఇసుక కూడా తరలిపోవడానికి వీల్లేదని అధికారులకు స్పష్టం చేశారు. ఇసుక విషయంలో ఎక్కడైనా అక్రమాలు జరుగుతున్నట్లు తెలిస్తే మొదటి బాధ్యత అధికారులదేనన్నారు. తప్పులు జరిగితే ముందుగా అధికారులపైనే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మద్యం పాలసీ, ఇసుక విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రజల జేబులు గుల్ల చేసేలా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించాల్సిన పనిలేదని అధికారులకు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.