CM Chandrababu : ఆంధ్రప్రదేశ్‌పై విరుచుకుపడిన మొంథా తుఫాన్ కారణంగా పంటలు, ఆస్తులు భారీగా దెబ్బతిన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా తుఫాన్ ప్రభావం, పంట నష్టం, పునరావాస చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో సీఎం పరిస్థితిని సమీక్షిస్తూ పలు సూచనలు జారీ చేశారు.
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. తుఫాన్‌ను ఎలా ఎదుర్కోవాలో ముందుగానే అన్ని విధాలా సిద్ధమయ్యామన్నారు. అవసరమైన ప్రోక్లేన్స్‌ను ముందుగానే సిద్ధం చేసుకున్నామని, NDRF, SDRF బృందాలను, సీనియర్ అధికారులను అందుబాటులో ఉంచామని తెలిపారు. “1996లో హరికేన్ తుఫాన్ చూశాను. ఒడిశాలో తుఫాన్ వచ్చినప్పుడు మన పరికరాలను అక్కడికి పంపాం. హుద్ హుద్ తుఫాన్, విజయవాడలో బుడమేరు వరద.. ఇవన్నీ ఎదుర్కొన్నాం. టెక్నాలజీ సాయంతో తుఫాన్లను ఎదుర్కొనే విధానాన్ని బలపరిచాం,” అని వివరించారు.
“గ్రామ, వార్డు సచివాలయాల నుండి రాష్ట్ర సచివాలయం వరకు ప్రతి సిబ్బంది ఈ విపత్తు సమయంలో సమన్వయంగా పని చేశారు. తుఫాన్ దిశ మారడంతో ఎప్పటికప్పుడు అధికారులను అలెర్ట్ చేసి చర్యలు చేపట్టాం. కొన్ని ప్రాంతాల్లో వర్షం పడకపోయినా, డ్రెయినేజ్ వ్యవస్థలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసాం,” అని అన్నారు.
“చెట్లు కూలిపోయిన చోట వెంటనే క్లియరెన్స్ పనులు చేపట్టాం. రోడ్లను శుభ్రం చేసి రవాణా వ్యవస్థ పునరుద్ధరించాం. పునరావాస కేంద్రాల్లో ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేశాం. గర్భిణీలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వైద్య సదుపాయాలు కల్పించాం,” అని తెలిపారు. “ఎన్నడూ లేని విధంగా ఈ తుఫాన్‌ను ఎదుర్కొన్నాం. ఈ తుఫాన్ నిజంగా దాగుడుమూతలు ఆడింది. కాకినాడలో తీరం దాటుతుందని అందరూ చెప్పారు, కానీ అది అంతర్వేది వద్ద తీరం దాటి, తెలంగాణలో ఎక్కువగా వర్షం కురిసింది. అనుకున్న ప్రాంతాలకంటే వేరే ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి,” అని అన్నారు.
“రిజర్వాయర్లలో ఉన్న నీటి స్థాయిలను గుర్తించి ముందుగానే ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఇప్పుడు ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం,” అని సీఎం చంద్రబాబు తెలిపారు.