CM Chandrababu: జల వనరుల శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని పలు ప్రాజెక్టుల పని తీరుపై ఆరా తీశారు. పోలవరం ప్రాజెక్టుపై చర్చించారు. నిర్ధేశించికున్న లక్ష్యాల మేర పనులు జరగకపోతే.. ఇటు అధికారులు, అటు కాంట్రాక్టర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అనుమతులు ఉండి నిధుల సమస్యలేని ప్రాజెక్టుల్లో జాప్యాన్ని సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వివిధ సాగునీటి ప్రాజెక్టుల పనులు, కొత్తగా చేపట్టే ప్రాజెక్టులపై ఆరా తీశారు. ముందుగా పోలవరం పనులపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. మొత్తం 1379 మీటర్ల డయాఫ్రం వాల్ నిర్మాణం జరగాల్సి ఉందని.. గత నెల ప్రారంభమైన డయాఫ్రం వాల్ పనుల్లో ఇప్పటి వరకు 51 మీటర్లు పూర్తి అయ్యిందని…ఇంకా 1328 మీటర్లు పూర్తి చెయ్యాలని అధికారులు వివరించారు.
Read Also: CM Yogi Adityanath: ఎంతకు తెగించార్రా.. యోగికే “టోపీ” పెడతారా..
ఇక, ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు జరగాల్సిందే అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పోలవరం, బనకచర్ల అనుసంధానంపై కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా పోలవరం లాంటి భారీ ప్రాజెక్టుల్లో రోజుకు ఎంత పని జరగాలి, ఈ నెలకు ఎంత పని జరగాలి అనేది లక్ష్యంగా పెట్టుకుని ఆ మేరకు పనులు పూర్తి చేయాలని పేర్కొన్నారు. పోలవరం కుడి మరియు ఎడమ కాలువ కనెక్టివిటీ పనుల్లో కొనసాగుతున్న జాప్యాన్ని వచ్చే సమీక్ష నాటికి పూర్తి ప్రోగ్రస్ రిపోర్ట్ అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.