గార్దబాలు గుడి చుట్టూ తిరిగి అమ్మవారి మొక్కులు తీర్చాయి. మీరు వింటున్నది నిజమే గాడిదలు ఉగాది ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి మొక్కులు చెల్లించాయి. కర్నూలు జిల్లా కల్లూరు చౌడేశ్వరి ఆలయంలో వినూత్న రీతిలో ఉత్సవాలు నిర్వహిస్తారు. ఉగాది రోజున అందరూ కొత్త బట్టలు వేసుకొని పూజలు చేసి మొక్కు తీర్చుకుంటే చౌడేశ్వరి ఆలయంలో గాడిదలు, ఎడ్లబండ్లతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. అది బురదమట్టిలో గాడిదలతో ప్రదక్షిణలు చేయించడం ఇక్కడి ఆనవాయితీ.
కర్నూలు జిల్లా కల్లూరులో ఉగాది వచ్చిందంటే చాలు యువతకు ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. చిన్న పెద్దా తేడా లేకుండా బురద మట్టితో పొర్లుతారు. గాడిదలతో బురద మట్టిలో ప్రదక్షిణలు చేస్తారు. ఉగాది ఉత్సవాలలో భాగంగా చౌడేశ్వరి జాతర నిర్వహిస్తారు. ఈ జాతరలో భాగంగా ఆలయం చుట్టూ నల్ల మట్టిని నింపి నీళ్లతో నింపి బురదమయం చేస్తారు. ఆ బురద మట్టిలో ప్రదక్షిణలు చేస్తే అంతా మంచే జరుగుతుందని భక్తుల నమ్మకం. కోరికలు తీరిన వారు కూడా బురద మట్టిలో ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. చౌడేశ్వరి జాతరలో రైతులు, రజకులు ఎక్కువగా పాల్గొంటారు. ఉత్సవాలు చూసేందుకు పెద్ద ఎత్తున జనం వస్తుంటారు. తరతరాలుగా ఈ జాతర జరుగుతోంది. ఎడ్లబండ్లు, గాడిదలతో బురదలో ప్రదక్షిణలు చేసేందుకు ఎంతో ఉత్సాహంగా వస్తుంటారు స్థానికులు.