Kidnap Mistery: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో 8 ఏళ్ల బాలుడి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. రాజీవ్ సాయి (8) అనే బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. రాజీవ్ తండ్రి చెన్నైలో ధాన్యం వ్యాపారం చేస్తున్నాడు. దసరా పండుగ కోసం వీరి కుటుంబం చెన్నై నుంచి చిలకలూరిపేటకు వచ్చింది. పట్టణంలోని 13వ వార్డులో ఉన్న దేవాలయంలో రాజీవ్ తల్లిదండ్రులు పూజలు చేస్తున్న సమయంలో బాలుడిని దుండగులు కిడ్నాప్ చేశారు. రాజీవ్ తల్లిందండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కిడ్నాప్ చేసిన రాజీవ్ సాయి అనే బాలుడిని నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని మాగుంట పార్వతమ్మ గెస్ట్ హౌస్ సమీపంలో దుండగులు వదిలేసి వెళ్లారు.
Read Also:Gujarat: గార్బా డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో యువకుడి మృతి
మరోవైపు కిడ్నాపర్ల ఆడియో కూడా ఎన్టీవీకి చిక్కింది. రూ.కోటి ఇస్తేనే బాలుడిని విడిచిపెడతామని.. బాలుడు తమ దగ్గరే ఉన్నాడని.. రూ.10 లక్షలు ఇచ్చినా, రూ.50 లక్షలు ఇచ్చినా వదిలిపెట్టబోమని కిడ్నాపర్లు బెదిరించారు. బాలుడిని వీడియో కాల్‌లో చూపిస్తామని ఆడియోలో చెప్పారు. అయితే పోలీసులు చాకచక్యంగా ఈ కిడ్నాప్ కేసును ఛేదించారు. చిలకలూరిపేటలో కిడ్నాప్ చేసిన దుండగులను హైవేపై చేజ్ చేశారు. దీంతో బాలుడిని వదిలేసి కిడ్నాపర్లు సర్వీసు రోడ్డు మీదుగా పరారయ్యారు. బాలుడిని క్షేమంగా కాపాడిన పోలీసులు చిలకలూరిపేట తీసుకువెళ్లారు. కాగా కిడ్నాపర్లు నార్త్ ఇండియాకు చెందిన వారు అని పోలీసులు తమ విచారణలో గుర్తించారు.