అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులే..అర్హత లేకున్నా ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చీమకుర్తి నగర పంచాయతీ చైర్మన్, వృద్ధాప్య పెన్షన్ పొందుతున్నారని, సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది.. ఛైర్మన్ గా ఉంటూ నలుగురు అర్హులకు పెన్షన్ల కోసం సిఫారసులు చేయాల్సింది పోయి ఆయనే పెన్షన్ తీసుకోవటమేంటని విమర్శలు వస్తున్నాయి.
ప్రకాశం జిల్లా చీమకుర్తి నగర పంచాయతీ చైర్మన్ చల్లా అంకులు, నెలా నెలా వృద్ధాప్య పింఛను అందుకుంటున్న విషయం జిల్లాలో హాట్ టాపిక్ లా మారింది.. డెబ్బై ఏళ్లకు పైగా వయసున్న చల్లా అంకులు.. వైసీపీ తరఫున చీమకుర్తి నగర పంచాయతీ చైర్మన్ గా భాద్యతలు చేపట్టారు. ప్రతి నెలా చైర్మన్ హోదాలో అధికారికంగా 12 వేల రూపాయల గౌరవ వేతనాన్ని పొందుతున్నారు. గతంలో చల్లా అంకులు 108709778 అనే గుర్తింపు నంబరుతో వృద్ధాప్య పెన్షన్ పొందేవారు. అయితే నగర పంచాయతీ చైర్మన్ గా ఎన్నికైన తర్వాత, వస్తున్న గౌరవ వేతనంతో పాటు ప్రతీనెలా క్రమం తప్పకుండా వృద్ధాప్య పెన్షన్ 2వేల 500ను కూడా తీసుకుంటున్నారని సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున్న విమర్శలు చెలరేగుతున్నాయి. చీమకుర్తి నగరపంచాయతీ అధికారులు, నిబంధనలకు విరుద్దంగా వృద్దాప్య పెన్షన్ ను సైతం ఠంచన్‌గా ప్రతి నెలా ఎలా అందిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
నగర పంచాయతీ చైర్మన్ చల్లా అంకులు మాత్రం.. తనకు ఈ అంశంపై అవగాహన లేకపోవటం వల్లే ఇదంతా జరిగిందంటున్నారు. గౌరవ వేతనం తీసుకుంటూ వృద్ధాప్య పెన్షన్ తీసుకోకూడదని తనకు తెలియదన్నారు. ప్రభుత్వానికి మచ్చతెచ్చేలా తాను వ్యవహరించనని తన గౌరవ వేతనాన్ని రద్దు చేసుకుంటానన్నారు. ఇక నుండి వృద్ధాప్య పెన్షన్ 2,500 రూపాయలు మాత్రమే తీసుకుంటానన్నారు. ఇదిలా వుంటే.. పంచాయతీ ఛైర్మన్ పెన్షన్ వ్యవహారం తన దృష్టికి వచ్చిందని.. ఉన్నతాధికారులను సంప్రదించి తగిన చర్యలు చేపడతామంటున్నారు నగర పంచాయతీ కమీషనర్ వెంకటరామిరెడ్డి.
సామాన్యులకు అందని ద్రాక్షలా ఉన్న పెన్షన్లు.. కాస్తా పలుకుబడి ఉంటే చాలు ఆస్తులతో సంబంధం లేకుండా అధికారులు ఇచ్చేస్తున్నారని సామాన్యులు ఆరోపిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో విషయం రచ్చరచ్చగా మారేంత వరకూ అధికారులు మేల్కొకుండా ఉండటం ఏంటని నిలదీస్తున్నారు…