YS Jagan: సీఎం చంద్రబాబుపై వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు అవుతోంది.. ఈ కాలంలో ప్రజలకు ఒక్క మంచి పని కూడా జరగలేదని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే మూడు బడ్జెట్లు ప్రవేశ పెట్టింది.. అయినా ప్రజల జీవన పరిస్థితుల్లో ఎలాంటి మెరుగుదల లేదన్నారు. గతంలో తమ ప్రభుత్వం మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించి, ఇచ్చిన ప్రతి హామీని నిబద్ధతతో అమలు చేశామన్నారు. కోవిడ్ లాంటి తీవ్ర సంక్షోభ పరిస్థితుల్లో కూడా సంక్షేమ పథకాలను ప్రజలకు అందించామని వైఎస్ జగన్ గుర్తు చేశారు.
Read Also: Ajit Pawar Plane crash: సమస్యను ముందే గుర్తించిన పైలట్.. మూడోసారి ల్యాండింగ్ చేస్తుండగా..!
అయితే, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత తమ ప్రభుత్వ హయాంలో అమలైన అన్ని పథకాలు రద్దు చేశారని మాజీ సీఎం జగన్ విమర్శించారు. ‘సూపర్ సిక్స్, సూపర్ సెవెన్’ పేరుతో చంద్రబాబు చెప్పిన హామీలు అబద్ధాలని తేలిపోయాయి.. వైసీపీ ఐదేళ్ల పాలనలో.. కోవిడ్ ఉన్నా కేవలం రూ.3.32 లక్షల కోట్ల అప్పులు మాత్రమే చేశాం.. అందులో రూ.2.73 లక్షల కోట్లను నేరుగా ప్రజల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. బ్యాంకు ఖాతాలు, ఆధార్ కార్డుల ఆధారంగా డబ్బులు ఎవరికెక్కడికి వెళ్లాయో చూపిస్తామన్నారు. కానీ, చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లు తిరక్కముందే రూ.3 లక్షల కోట్ల అప్పులు చేసిందని ఆరోపించారు. ఆ డబ్బు ఎక్కడికి వెళ్లిందో చెప్పాలని జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.
Read Also: MLA Arava Sridhar: ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణకు కమిటీ..
ఇక, మద్యం షాపులన్నీ చంద్రబాబు అనుచరుల చేతుల్లోనే ఉన్నాయని వైసీపీ అధినేత జగన్ పేర్కొన్నారు. బెల్ట్ షాపుల ద్వారా ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో ఇసుక ద్వారా ప్రభుత్వానికి రూ.750 కోట్ల ఆదాయం వచ్చేది, ఇప్పుడు ఇసుక డబుల్ రేట్లకు అమ్ముతున్నా ప్రభుత్వానికి ఆదాయం రావడం లేదన్నారు. అలాగే, రాష్ట్రం పూర్తిగా ‘జంగిల్ రాజ్’గా మారిపోయింది. సంక్రాంతి సమయంలో కోడిపందాలు, రికార్డింగ్ డ్యాన్సులు, బహిరంగ మద్యం సేవలు జరగడం చూస్తే ప్రభుత్వం ఉందా లేదా అన్న సందేహం కలుగుతోందని మాజీ సీఎం జగన్ అన్నారు.
అలాగే, పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు మహిళలపై వేధింపులు, దాడులు, బెదిరింపుల ఆరోపణలు ఉన్నాయని వైఎస్ జగన్ గుర్తు చేశారు. అయినా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలు ఈసారి ‘ఫుట్‌బాల్ తన్నినట్లు తంతారు’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను ఒకటిన్నర సంవత్సరం పాటు 150 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసి ప్రజల మధ్య ఉంటానని ప్రకటించా.. వైఎస్సార్‌సీపీ క్యాడర్ బలంగా ఉంది.. గ్రామస్థాయి కమిటీలు మరింత పటిష్టంగా నిర్మించాల్సిన అవసరం ఉందని జగన్ స్పష్టం చేశారు.
