సత్యసాయి జిల్లాలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన ఉద్రిక్తంగా మారింది. తన సొంత నియోజకవర్గం హిందూపురం వెళుతున్న బాలయ్యను కొడికొండ చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. బాలకృష్ణ వెంట వెళుతున్న వాహనాలను పోలీసులు నిలిపివేశారు. దీంతో పోలీసులతో టీడీపీ నేతలు, బాలయ్య అభిమానులు వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత తలెత్తింది.
రెండు వారాల క్రితం హిందూపురం నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు బాలాజీ, నరసింహమూర్తి గాయపడ్డారు. వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు బాలయ్య హిందూపురంలో పర్యటించాలని భావించారు. అయితే గ్రామంలో ఇంకా పరిస్థితి సద్దుమణగలేదనే సాకుతో పోలీసులు బాలయ్య పర్యటనపై ఆంక్షలు విధించారు. ఎక్కువ వాహనాలను అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. దీంతో బాలయ్య వాహనంతో పాటు మరో మూడు వాహనాలకు మాత్రం అనుమతి ఇస్తామని పోలీసులు చెప్పడంతో అన్ని వాహనాలకు అనుమతి ఇవ్వాల్సిందేనని టీడీపీ నేతలు వాళ్లతో వాగ్వాదానికి దిగారు.
కాగా ఏపీలోని చాలా చోట్ల వైసీపీ నేతలు గ్రామాల్లో కక్షలు రేపే విధంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ దాడిని ఖండిస్తున్నానని చెప్పారు. మరోసారి తమ కార్యకర్తల జోలికి వస్తే తిరగబడతామని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదని… అంతా బాదుడే బాదుడు అంటూ బాలయ్య ఆరోపణలు చేశారు.