దేశంలో కరోనా బాధితుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ప్రతీరోజూ వేల సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. చాలా మందికి కృత్రిమ ఆక్సిజన్ అందించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో ఆక్సిజన్ సిలిండర్లకు డిమాండ్ పెరిగింది. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ దొరక్క రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆక్సిజన్ వృథాను అరికట్టడంపై దృష్టి పెట్టాలని రాష్ట్రాలను కోరింది కేంద్ర ప్రభుత్వం. ఆసుపత్రుల్లో అవసరాన్ని బట్టి ఆక్సిజన్ వినియోగించాలని సూచించింది. ప్రస్తుతం సరిపడా ఆక్సిజన్ అందుబాటులో ఉందని, ఎవరూ ముందస్తుగా నిల్వలు చేయకూడదని సూచించింది కేంద్ర ఆరోగ్య శాఖ.
ఆక్సిజన్ కు డిమాండ్ పెరగడంతో ఉత్పత్తిని భారీగా పెంచినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. దేశంలో ప్రస్తుతం రోజుకు 7వేల 127 మిలియన్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం ఉందని, రెండు రోజులుగా పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేస్తున్నట్లు వివరించారు. డిమాండ్ తగ్గట్టుగా ఆక్సిజన్ ను అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు ఆరోగ్యశాఖ అధికారులు. ఆక్సిజన్ సరఫరా సక్రమంగా జరిగేలా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు సూచించింది కేంద్ర ఆరోగ్య శాఖ. ప్రస్తుతం మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, చత్తీస్‌గఢ్, పంజాబ్, తమిళనాడు, ఢిల్లీ, రాజస్తాన్ రాష్ట్రాల్లో మెడికల్ ఆక్సిజన్‌ను అధికంగా వినియోగిస్తున్నారు.