Rapthadu Heat: శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడులో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. తాజాగా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరులు తోపుదుర్తి చందు, రాజశేఖర్ రెడ్డిలపై సీకే పల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సీకే పల్లికి చెందిన మరికొందరు వైసీపీ నాయకులపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీ కార్యకర్త గంటాపురం జగ్గుపై దాడి చేసిన వైసీపీ నాయకులపై బెయిలబుల్ కేసులు, అక్రమ అరెస్ట్ బాధితుడు జగ్గుపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టి సీకే పల్లి పోలీసులు జైలుకు పంపారు. మరోవైపు పోలీస్ 30 ఆక్ట్ ఉల్లంఘించారని మాజీ మంత్రి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్, బీకే పార్థసారథిలపై సీకే పల్లి పోలీస్ స్టేషన్‌లో సుమోటో కేసు నమోదైంది.
Read Also: Sasana Sabha: ‘శాసనసభ’ ట్రైలర్‌ను ఆవిష్కరించిన మంత్రి రోజా
అటు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సోదరుడు చంద్రశేఖర్‌రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి పరిటాల సునీత తీవ్రంగా ఖండించారు. ఒక పార్టీ అధినేతను ముసలోడు అంటూ సంభోదించడం సిగ్గుచేటు అని.. భవిష్యత్‌లో చంద్రశేఖర్‌రెడ్డి ముసలోడు కాడా అంటూ ప్రశ్నించారు. మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హితవు పలికారు. చంద్రబాబును చంపేస్తారా.. పరిటాల కుటుంబాన్ని భూస్థాపితం చేస్తారా.. అయితే రండి చూసుకుందాం అంటూ ఆమె సవాల్ విసిరారు.
మరోవైపు తన సోదరుడు చేసిన కామెంట్లపై రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి కూడా స్పందించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఫ్యాక్షన్ నైజాన్ని దృష్టిలో పెట్టుకుని తన తమ్ముడు మాట్లాడాడు అని.. తన తమ్ముడు మాట్లాడిన భాష తప్పు అని, కానీ భావం సరైందే అని సమర్ధించారు. చంద్రబాబు, లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో గోబెల్స్ ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. వైసీపీలో కొంత మంది ఎమ్మెల్యేల వ్యక్తిత్వ హనానికి టీడీపీ నేతలు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గెలవలేక బట్టకాల్చి మీద వేస్తున్నారని.. అనంతపురం జిల్లాలో మళ్లీ ఫ్యాక్షన్ రెచ్చగొట్టే చర్యలు కనిపిస్తున్నాయని విమర్శలు చేశారు. అనంతపురంలో పారిన నెత్తురు దాని వెనుక చంద్రబాబు హస్తం గురించి చర్చించాలన్నారు. ఎన్నికల తర్వాత రాప్తాడు ఏరియా ప్రశాంతంగా ఉందని.. దానిని భగ్నం చేసేందుకు కుట్ర జరుగుతోందని ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి అన్నారు. టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని అనంతపురం జిల్లా ప్రజలు నమ్మవద్దని కోరారు. ఆధిపత్యం కోసం హత్యా రాజకీయాలను ప్రోత్సహించింది పరిటాల కుటుంబమేనని ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి అన్నారు.