కరోనా కారణంగా దాదాపు రెండేళ్లుగా విద్యార్ధుల చదువులు అటకెక్కేశాయి. స్కూళ్లకు తాళాలు పడ్డాయి. పరీక్షల నిర్వహణ కూడా సక్రమంగా జరగలేని పరిస్థితి నెలకొంది. అయితే విద్యార్ధుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని విద్యాసంస్థలు తెరవాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. ఇటీవలే స్కూళ్లు కూడా తెరుచుకున్నాయి. మొదట్లో విద్యార్ధుల హాజరు శాతం తక్కువగా ఉన్నా.. క్రమంగా పుంజుకుంది. అలాగే స్కూళ్లలో అన్ని రకాల జాగ్రత్తలు సైతం తీసుకుంటున్నారు. అయినా కొన్ని చోట్ల కరోనా కేసులు బయటపడడం కలకలం రేపింది. విజయనగరం జిల్లా బొబ్బిలిలో పదిమంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా తేలింది.
బొబ్బిలి మున్సిపల్ ప్రాధమిక పాఠశాలలో మొత్తం 26 మందికి టెస్టులు చేయగా.. నాలుగోతరగతికి చెందిన పది మందికి వైరస్ సోకినట్టు తేలింది. దీంతో వారం రోజుల పాటు స్కూలుకు సెలవు ప్రకటించారు. విద్యార్ధులు ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. అలాగే వారికి వైద్యసేవలు కూడా అందిస్తున్నారు. మరోవైపు కృష్ణాజిల్లా బావదేవరపల్లి పాఠశాలలో కూడా కేసులు బయటపడ్డాయి. ఇక్కడి విద్యార్ధులకు టెస్టులు నిర్వహించగా… ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. దీంతో వారికి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. పాఠశాలలు తెరిచి… తరగతులు కొనసాగుతున్న వేళ… ఇలా కేసులు మళ్లీ బయటపడడం కలవరపెడుతోంది. ఉపాధ్యాయులు, విద్యార్ధులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని… నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.