ఏపీ అసెంబ్లీలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి చెందిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాగ్ రిపోర్ట్ ఇచ్చారు. ఆర్థిక వ్యవహారాల్లో ప్రభుత్వం రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరించిందని కాగ్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అనుబంధ పద్దులను ఖర్చు చేసి.. తర్వాత జూన్ 2020లో శాసన సభలో ప్రవేశ పెట్టారు.. ఇది రాజ్యాంగ విరుద్దం అన్నారు. రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ఆర్థిక వ్యవహారాలు జరిగాయి. చట్టసభల ఆమోద ప్రక్రియను, బడ్జెట్ మీద అదుపును బలహీన పరిచారు. ప్రజా వనరుల వినియోగ నిర్వహణలో ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యాన్ని ప్రోత్సహించారు. శాసన సభ ఆమోదించిన కేటాయింపుల కంటే అధికంగా ఖర్చు చేసే సందర్భాలు పునరావృతం అవుతున్నాయి.
ఇక అదనపు నిధులు ఆవశ్యకం అని భావిస్తే…శాసన సభ నుంచి ముందస్తు ఆమోదం పొందేలా చూసుకోవాలి. గత ఐదేళ్ల నుంచి చెబుతోన్నా మార్పు రావడం లేదు. 2018 -19 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2019-20లో 3.17 శాతం రెవెన్యూ రాబడులు తగ్గాయి. కొత్త సంక్షేమ పథకాల వల్ల 6.93 శాతం మేర పెరిగిన రెవెన్యూ ఖర్చులు. 2018-19 నాటితో పొల్చితే 2019-20 నాటికి రూ. 32,373 కోట్ల మేర పెరిగిన బకాయిల చెల్లింపులు పూర్తి చేసారు. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ వివరాలను బడ్జెట్ పత్రాల్లో సరిగా చూపలేదు.శానస వ్యవస్థను నీరు గార్చేలా… నిధుల నిర్వహణ ఉంది అని పేర్కొన్నారు.