ఏపీలో మంత్రులందరూ రాజీనామాలు చేయడంతో కొత్త కేబినెట్‌లో ఎవరు ఉంటారన్న విషయంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. కేబినెట్‌లో ఎవరిని కొనసాగించాలి, ఎవరిని సాగనంపాలి అనేది సీఎం జగన్ ఇష్టమని, ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఉందని పేర్కొన్నారు. దేవుడి దయ ఉంటే మళ్లీ 24 మంది కేబినెట్‌లో తాను ఉంటానని బొత్స ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామన్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వైసీపీని అధికారంలోకి తీసుకురావడమే తమ ముందున్న టార్గెట్ అని బొత్స సత్యనారాయణ తెలిపారు. మంత్రులందరూ పూర్తి సంతోషంతోనే రాజీనామాలు చేశారని బొత్స స్పష్టం చేశారు. ఇప్పటి నుంచి సీఎం జగన్ ఏ బాధ్యతలు అప్పగించినా సమర్ధవంతంగా పనిచేస్తామని అన్నారు. రెండున్నరేళ్ల తర్వాత కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ ఉంటుందని సీఎం జగన్ మొదట్లోనే చెప్పారని, అదే విధంగా సీఎం జగన్ ఇప్పుడు కొత్త కేబినెట్‌ను తీసుకువస్తున్నారని పేర్కొన్నారు. విశాఖ భూముల వ్యవహారంలో తప్పంతా చంద్రబాబుదేనని బొత్స మరోసారి మండిపడ్డారు.