బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం నడ్డాకు పండితులు వేదాశీర్వచనం చేశారు. ఆ తర్వాత ప్రసాదం, చిత్రపటాని ఆయనకు అందజేశారు. ఎప్పటినుంచో జగన్మాత కనకదుర్గమ్మ దర్శనానికి రావాలని అనుకున్నానని.. ఇప్పటికి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. దుర్గమ్మ కరుణ కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారి ఆశీస్సులతో మంచి పాలన అందాలని కోరుకున్నారు.
మోడీ నేతృత్వంలో దేశం శరవేగంగా అభివృద్ది చెందుతోందన్నారు. అమెరికా అభివృద్ధి రేటు 4 శాతం ఉంటే ఇండియా 8 శాతంగా ఉందన్నారు. దేశంలో పేదరికం 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గిందని జేపీ నడ్డా స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా 2 కోట్ల 50 లక్షల ఇల్లు కట్టామని వెల్లడించారు. దేశంలో సొంత ఇల్లు లేని వారు ఎవరూ వుండకూడదని ప్రధాని మోదీ పని చేస్తున్నారన్నారు. జన్‌ధన్ ఖాతాల సంఖ్య 45 వేల కోట్లని.. వీరందరికీ 22 లక్షల కోట్ల రూపాయలు జమచేశామని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు.