Vishnu Vardhan Reddy: ప్రధాని మోదీ విశాఖ పర్యటన నేపథ్యంలో బీజేపీ కీలక నేతలందరూ విశాఖలోనే మకాం వేశారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు విష్ణువర్ధన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీజేపీ లైన్, జనసేన లైన్ ఒక్కటేనని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తాము సమర్థిస్తున్నామని విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. వైసీపీ వ్యతిరేక ఓటు టీడీపీకి వెళ్లకుండా చూసుకోవడమే బీజేపీ-జనసేన ముందున్న ఉమ్మడి లక్ష్యమని పేర్కొన్నారు. పెద్ద పార్టీలని చెప్పుకుంటున్న చాలా పార్టీలు కముమరుగైన పరిస్థితి ఉందని.. టీడీపీ బలమైన పార్టీ అయితే తెలంగాణలో ఎందుకు కనుమరుగైందని.. ఏపీలో ఎందుకు చతికిలపడిందో చెప్పాలన్నారు. ప్రధాని మోదీతో జనసేన అధినేత పవన్ భేటీ తర్వాత ఏపీ రాజకీయ ముఖ చిత్రం మారబోతోందని విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. టీడీపీని భుజాల మీద మోయాల్సిన అవసరం బీజేపీ-జనసేనకు లేదని స్పష్టం చేశారు.
Read Also: Nizam College Students : 50వద్దు మాకు 100కావాలని డిమాండ్ చేస్తున్న స్టూడెంట్లు
మరోవైపు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కూడా మీడియాతో మాట్లాడారు. తాము కుటుంబ, అవినీతి పార్టీలకు వ్యతిరేకం అని సోము వీర్రాజు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కూడా తమ విధానం అలాగే ఉంటుందన్నారు. తమ విధానాన్ని పదే పదే చెబుతున్నా.. మీడియా మళ్లీ అవే ప్రశ్నలు అడుగుతోందని అసహనం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీతో కోర్ కమిటీ జరిపే సభ్యుల సమావేశంలో కూడా ఇదే తరహాలో చర్చ జరుగుతుందని సోము వీర్రాజు తెలిపారు. తమ పార్టీది అభివృద్ధి అజెండా అని.. ప్రధానితో కోర్ కమిటీ, పవన్ కళ్యాణ్ భేటీలో కచ్చితంగా రాజకీయ పరమైన అంశాలు చర్చకు వస్తాయన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ప్రజాభిప్రాయం ఏంటనేది కేంద్రం దృష్టిలో ఉందని సోము వీర్రాజు పేర్కొన్నారు.