రైతు వ్యతిరేక వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించేంత వరకు రైతుల తరపున పోరాటం చేస్తామని కిసాన్ మోర్చారాష్ట్ర అధ్యక్షుడు వంగల శశిభూషణ్ రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్రకార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ఉద్యమ కార్యచరణ రూపొందిస్తున్నామన్నారు. అక్టోబర్ 2వ తేదీ నుండి రైతు ఉద్యమాలు నిర్వహిస్తామన్నారు. గత మూడు సంవత్సరాలు రైతాంగం నష్టపోతున్నా ఇక్కడ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
రైతులకు సంబంధించి కేంద్ర ప్రాయాజిత కార్యక్రమాలకు రాష్ట్రప్రభుత్వం తనవాటా చెల్లించడం లేదన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుకు ఒరిగింది ఏమీ లేదన్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుతాయన్న నమ్మకం లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. కేంద్రం భూసార కేంద్రాలు ఏర్పాటు చేసినా ఈ రాష్ట్ర ప్రభుత్వం వల్ల ఉపయోగం లేని పరిస్థితి ఉందన్నారు. కేంద్ర మంజూరు చేసిన పథకాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర నిధులను రాష్ట్రం పక్కదారి పట్టిస్తోందన్నారు. సాగునీటి ప్రాజెక్టు గేట్లు నీటి ప్రవాహానికి కొట్టుకు పోతుంటే ఈ ప్రభుత్వం ఏంచేస్తోందన్నారు.
Read Also: Perks cut in Google: కొంత మంది గూగుల్ ఉద్యోగులకు ప్రోత్సాహకాలు కట్!
పోలవరం ప్రాజెక్టు పరిస్థి ఏంటి?ఎప్పుడు పూర్తి చేస్తారని ప్రభుత్వాన్ని శశిభూషణ్ రెడ్డి ప్రశ్నించారు. రాయల సీమ, ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల గురించి రాష్ట్రప్రభుత్వం మాటవరసకు కూడా పట్టించుకునే పరిస్ధితి లేదు. ఇది ఒక నిద్రమత్తులో ఉన్న ప్రభుత్వంగా అభివర్ణించారు. పాడి సహకార రైతులను నట్టేముంచే విధంగా వైసీపి ప్రభుత్వం వ్యవహారం ఉందన్నారు. బోర్లు, డ్రిప్ ఇరిగేషన్ కు విద్యుత్ ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఏపీలో 16 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని, వారిని పట్టించుకోవడం లేదన్నారు. అరటి, పసుపు, చెరకు రైతులను ఆర్ధికంగా ఆదుకునేందుకు ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు కూడా చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందువల్ల రైతు ఉద్యమాలు దశల వారీగా నిర్వహిస్తామని ఆక్టోబర్ నుండి పోరాట పంథాను ఎన్నుకుంటున్నామని వివరించారు.
Read Also: Woman Killed By Grandson: సినిమా స్ఫూర్తితో.. నానమ్మను కిరాతకంగా చంపిన మనవడు