Elderly Woman Killed By Her Song and Grandson For Assets: పూణెలో దారుణం చోటు చేసుకుంది. తనని అల్లారముద్దుగా పెంచిన నానమ్మ అని కూడా చూడకుండా.. అత్యంత కిరాతకంగా చంపాడు ఓ మనవడు. అతనికి తండ్రి సహాయం చేయడం ఇంకా అమానుషం. ఆమె పేరు మీదున్న ఆస్తిని కాజేయడం కోసమే.. ఓ సినిమా స్ఫూర్తితో ఈ కిరాతక పనికి పాల్పడ్డారు ఆ తండ్రీకొడుకులు. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఆర్మీ క్యాంప్‌లో పని చేసిన ఉషా విఠల్ గైక్వాడ్ (64).. పదవీ విరమణ అనంతరం కేశవనగర్‌లో స్థిరపడ్డారు. ఆమెతో పాటు కొడుకు సందీప్ గైక్వాడ్ (45), కోడలు, మనవడు సాహిల్ గైక్వాడ్ (20) ఉంటున్నారు. ఈనెల 5వ తేదీన అత్తతో గొడవ పడి, కోడలు ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.
అదే రోజు మధ్యాహ్నం ఉషా విఠల్ నిద్రపోతుండగా.. మనవడు సాహిల్ ఆమెను స్నానాల గదిలోకి లాక్కెళ్లి, గొంతు నులిమి చంపేశాడు. ఈ విషయాన్ని తన తండ్రి సందీప్‌కి చెప్పాడు. కొడుకు చేసిన ఈ కిరాతక పనికి శిక్షించడం పోయి, అతనికి సహాయం చేశాడు ఆ తండ్రి. చంపింది తన తల్లినే అయినా, ఆస్తి దక్కుతుంది కదా అని, కొడుక్కి సహాయం చేశాడు. ఆమె మృతదేహాన్ని పాతిపెట్టేందుకు.. తండ్రీకొడుకులు కలిసి ఒక ప్లాన్ వేశారు. చెట్లను నరికే ఎలక్ట్రిక్ కటర్‌తో ఉషా విఠల్ మృతదేహాన్ని 9 ముక్కలుగా కత్తిరించారు. ఆ ముక్కల్ని సంచుల్లో కుక్కి, దగ్గరలో ఉన్న ముథా నదిలో పడేశారు. పక్కనే ఉన్న చెత్త డిపోలో మరో బ్యాగ్ వదిలేశారు. కత్తి, దుస్తుల్ని నది ఒడ్డున పారేసి, ఏమీ ఎరుగనట్టుగా ఇంటికి వెళ్లిపోయారు. అంతేకాదు, ఆమె మిస్ అయ్యిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆగస్టు 10వ తేదీన మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు, ఆమె కోసం గాలించడం మొదలుపెట్టారు.
రోజులు గడిచినా ఉషా విఠల్ ఆచూకీ కనిపించకపోవడంతో.. ఆమె కుమార్తెకు తన అన్నయ్య సందీప్ గైక్వాడ్ మీద అనుమానం వచ్చింది. దీంతో ఆమె అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించగా.. అసలు నిజం బయటపడింది. ఉషా విఠల్ కొడుకు సందీప్, మనవడు సాహిల్ కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తేలింది. నానమ్మ ఆస్తి కోసమే తాను ఈ హత్య చేశానని, ఓ మలయాళ సినిమా రీమేక్ చూశాక తనకు ఈ ఆలోచన వచ్చిందని సాహిల్ అంగీకరించాడు. పోలీసులు ఆ తండ్రీకొడుకుల్ని రిమాండ్‌కు తరలించారు.