జలవనరుల శాఖ మంత్రిగా వున్నప్పుడు తనదైన రీతిలో విపక్షాలపై విరుచుకుపడేవారు అనిల్ కుమార్ యాదవ్. మాజీ మంత్రి అయ్యాక ఆయనలో దూకుడు తగ్గిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. తాజాగా అనిల్ కుమార్ యాదవ్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. పవిత్రమైన అయ్యప్పస్వామి మాల వేసుకుని ఓట్ల కోసం మసీదులోకి వెళ్లి ప్రార్థనలు చేయడం వివాదాస్పదం అవుతోంది. ఇది ఎంతవరకు సబవని బీజేవైఎం నేతలు ప్రశ్నించారు. అనిల్ తీరుకు నిరసనగా నెల్లూరు నగరం ఇస్కాన్ సిటీలోని అనిల్ కుమార్ యాదవ్ ఇంటిని ముట్టడించారు.
హిందువుల మనోభావాలను కించపరుస్తున్న ఎమ్మెల్యే అనిల్ వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అయ్యప్ప మాల వేసుకుని ముస్లిం లాగా తలపై టోపీ పెట్టుకుని మసీదు లోకి ఏ విధంగా వెళ్తారని వారంతా ప్రశ్నించారు. అనిల్ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇంటి వద్దకు చేరుకొని బీజేవైఎం నేతలను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇస్కాన్ సిటీలోని మాజీ మంత్రి అనిల్ నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయ్యప్పమాలలో ఉంటూ.. మాజీ మంత్రి అనిల్ ముస్లిం ప్రార్దనలలో పాల్గొన్నారని బీజేవైఎం నేతలు మండిపడుతున్నారు. రాజకీయాల కోసం అయ్యప్పమాలను వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం అవుతోంది. హింందువులకు, అయ్యప్ప భక్తులకు అనిల్ క్షమాపణ చెప్పాలని బిజేవైఎం నేతలు డిమాండ్ చేస్తున్నారు.
Read Also: Radhika Sharathkumar: దేవుడా.. సూపర్ స్టార్ ను పట్టుకొని అంత మాట అనేసిందేంటి..?
నెల్లూరులోని ఖుద్దూస్ నగర్ లో ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా అనిల్ కుమార్ ఇంటింటికీ తిరిగారు. అయితే, ఆయన స్థానిక ప్రజల మతాచారాలకు అనుగుణంగా ముస్లిం టోపీ, కండువా ధరించారు. దీనిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు అనిల్ తీరుని తప్పుబట్టారు. స్వామి అయ్యప్ప దీక్షలో ముస్లింల టోపీ, కండువా వేసుకుని భక్తులను అవమానించిన వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని జీవీఎల్ పేర్కొన్నారు. దీక్ష నియమాలు పాటించని ఎమ్మెల్యేను శబరిమల వెళ్లకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఇటువంటి ఓటు బ్యాంకు రాజకీయాలు హిందువులు సహించరని జగన్ తెలుసుకోవాలని స్పష్టం చేశారు.
విష్ణువర్ధన్ రెడ్డి స్పందిస్తూ, హిందువుల ఆరాధ్య, పవిత్రమైన అయ్యప్పమాల దీక్షను అవమానపరిచిన మాజీమంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. దీక్షాపరులకు ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వైసీపీ నేత బరితెగించడం సిగ్గుచేటు అని విష్ణు విమర్శించారు. ఇలాంటివి హిందూ సమాజం క్షమించదని బీజేపీ హెచ్చరిస్తున్నట్టు తెలిపారు. దీక్ష నియమాలు పాటించని ఎమ్మెల్యే అనిల్ ను శబరిమల వెళ్లకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు అనిల్ కుమార్ యాదవ్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. ఓట్ల కోసం ఇంత బరితెగించాల్సిన అవసరం లేదని బీజేపీ. హిందూత్వవాదులు మండిపడుతున్నారు.
Read Also: Minister KTR : హైదరాబాద్ వాసులకు శుభవార్త.. త్వరలోనే మెట్రో రెండో ఫేజ్