ఎయిమ్స్ ఉన్నతాధికారులకు తలంటేశారు కేంద్ర మంత్రి భారతీ ప్రవీణ్ పవార్. మంగళగిరి ఎయిమ్స్ ని ఆమె సందర్శించారు. ఓపీ మొదలుకుని ఆస్పత్రిలో అందుతోన్న ప్రతి ఒక్క సేవ పైనా ఎయిమ్స్ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు పవార్. దీంతో నీళ్లు నమిలారు ఎయిమ్స్ అధికారులు. ఆస్పత్రికి నీటి సమస్య ఉందని.. టెండర్లు రావడం లేదన్నారు అధికారులు.
ఇంత పెద్ద భవనాలు కట్టడానికి టెండర్లు వచ్చినప్పుడు.. నీటి సరఫరా కోసం టెండర్లు ఎందుకు రావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి నీటి సమస్యను తీసుకెళ్లారా అంటూ ప్రశ్నించారు పవార్. సీఎం ఈ సమస్యను పరిష్కరిస్తామని హామి ఇచ్చారని అధికారులు కేంద్రమంత్రికి వివరించారు. వెంట పడి పని చేయించుకోవాలి కదా అంటూ కేంద్ర మంత్రి చురకలు అంటించారు. AIIMS లో ఖాళీలను భర్తీ చేయాల్సిన అంశాన్ని ప్రస్తావించారు అధికారులు.
దీనిపై ఎప్పటికప్పుడు కేంద్రం దృష్టికి ఎందుకు తీసుకురాలేదని మండిపడ్డారు. ఓపీ సరిగా చూడడం లేదన్న ఫిర్యాదులపై అధికారులను వివరణ అడిగారు కేంద్ర మంత్రి. మీరు చేయలేకపోతున్నారని.. ప్రతి రోజూ నన్నే ఓ గంట పాటు ఓపీ చూడమంటారా..? అంటూ కేంద్ర మంత్రి పవార్ సీరియస్ అయ్యారు. ల్యాబ్ రిపోర్టులు ఎంత సేపట్లో అందిస్తున్నారని ప్రశ్నించారు కేంద్ర మంత్రి.
గంటలో అందిస్తున్నట్టు వెల్లడించిన అధికారులు. తనకొచ్చిన సమాచారం ప్రకారం ఓ రోజు పడుతోందని.. రిపోర్టులు వెంటనే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. వేల కోట్ల రూపాయలతో నిధులందించినా ఆస్పత్రి నిర్వహణ ఇలా చేస్తారా..? అంటూ అధికారులపై మండిపడ్డారు కేంద్రమంత్రి భారతీ పవార్. ప్రధాని మోడీ ఒక్కరే పని చేస్తే సరిపోదని.. అందరూ పని చేయాలన్నారు కేంద్ర మంత్రి పవార్.