Murder : బాపట్ల జిల్లాలో తండ్రీకొడుకులు దారుణ హత్యకు గురయ్యారు. ఓ కేసులో కోర్టుకి హాజరయ్యేందుకు వచ్చిన తండ్రి కొడుకుని కిడ్నాప్ చేసిన ప్రత్యర్థులు…గొంతు కోసి దారుణ హత్య చేశారు. ఈఘటన బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కలకలం రేపింది. ఒక్కసారిగా స్థానికులు ఉలికిపాటుకు గురయ్యారు.
బాపట్ల జిల్లా సంతమాగులూరుకి చెందిన వీరాస్వామిరెడ్డి గత కొంత కాలంగా బెంగళూరులో స్థిరపడి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అయితే వీరాస్వామిరెడ్డికి, సంతమాగులూరుకి చెందిన గడ్డం అనిల్ కుమార్ రెడ్డికి మధ్య ఆర్థిక లావాదేవీల్లో విభేదాలు ఉన్నాయి. ఈనేపథ్యంలో వీరాస్వామిరెడ్డికి చెందిన చెక్కుల్ని అనిల్ కుమార్ రెడ్డి అద్దంకి, ఒంగోలు, నరసరావుపేట కోర్టుల్లో కేసు వేశాడు. చెల్లని చెక్కుల కేసులో పల్నాడు జిల్లా నరసరావుపేట కోర్టులో హాజరయ్యేందుకు వీరాస్వామిరెడ్డి, ఆయన కొడుకు ప్రశాంత్ రెడ్డి, లాయర్ నాగభూషణం బెంగళూరు నుంచి మంగళవారం రోజున నరసరావుపేట వచ్చారు…
బుధవారం ఉదయం బయట టిఫిన్ చేసి కోర్టుకి వెళ్తున్న వీరాస్వామిరెడ్డి, ఆయన కొడుకు ప్రశాంత్ రెడ్డిని స్కార్పియో కారులో వచ్చిన గడ్డం అనిల్ కుమార్ రెడ్డి మరికొంత మందితో కలిసి కిడ్నాప్ చేశారు. అక్కడే ఉన్న స్థానికులు స్కార్పియో కారుని వెంబడించినా ఫలితం లేకుండా పోయింది…
కిడ్నాప్‌గు గురైన తండ్రీ కొడుకులు వీరాస్వామిరెడ్డి, ప్రశాంత్ రెడ్డిని బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం పాతమాగులూరు శివారులోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్‌లో గొంతు కోసి దుండగులు పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కేసులో ప్రధాన నింధితుడు అనిల్ కుమార్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆర్థిక లావాదేవీల్లో వివాదాలు కారణంగా హత్యలు జరిగినట్టు తెలుస్తోంది…
మొత్తంగా తండ్రీకొడుకుల దారుణ హత్య ఘటన పల్నాడు, బాపట్ల జిల్లాల్లో తీవ్ర కలకలం రేపింది. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం నర్సరావుపేట ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తండ్రీకొడుకుల జంట హత్యలకు గల కారణాలను విశ్లేషించేందుకు నిందితుడు అనిల్ కుమార్ రెడ్డిని విచారిస్తున్నారు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు..