కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.. సాయంత్రం ఏడు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.. ఎస్సీ రిజర్వ్‌డ్ సెగ్మెంట్ అయిన బద్వేల్‌లో మొత్తం రెండులక్షల 16వేల 206 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు లక్షా 8వేల 809 మంది, మహిళలు లక్షా 7వేల 375 మంది కాగా, థర్డ్ జెండ్ లో 22 మంది. ఇద్దరు మహిళలతో కలిపి మొత్తం 15 మంది అభ్యర్ధులు ఎన్నికల బరిలో ఉన్నారు. నియోజకవర్గంలో మొత్తం 281 పోలింగ్ స్టేషన్లు ఉండగా, వీటిలో 221 పోలింగ్ స్టేషన్లు క్రిటికల్ క్యాటగిరిలో ఉన్నాయి. పోలింగ్ కేంద్రాలను వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించనున్నారు. పోలింగ్ కేంద్రాల బయట పరిస్థితుల్ని కవర్ చేయటానికి అదనంగా మరికొంత మంది వీడియో గ్రాఫర్ల సేవలు వినియోగించుకోనున్నారు.
ఎన్నికలు పూర్తిగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించటానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించిన రాష్ట్ర ఎన్నిక ప్రధానాధికారి ఓటర్లందరూ పెద్ద ఎత్తున ముందుకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. పోలింగ్ నిర్వహణ కోసం 1348 మందికి బాధ్యతలు అప్పగించారు. 15 కంపెనీల కేంద్ర పారామిలటరీ బలగాలను మోహరించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన నలుగురు అబ్జర్వర్లు పోలింగ్ నిర్వహణలో పాలుపంచుకుంటున్నారు.. కోడ్ ఉల్లంఘన కింద ఇప్పటి వరకూ 18 కేసులు దాఖలయ్యాయి. నగదు, బంగారం, వెండి తదితర కలిపి మొత్తం రెండు కోట్ల రూపాయల విలువైన సరుకు సీజ్ చేసారు. అత్యవసర సేవలకు మినహా ఇతర ప్రాంతాల నుంచి ఎవరూ పోలింగ్ సమయంలో నియోజకవర్గంలోని రాకుండా సరిహద్దులు మూసివేయనున్నట్లు రాష్ట్ర ఎన్నిక ప్రధానాధికారి వెల్లడించారు. కాగా, 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బద్వేల్ నియోజకవర్గంలో 77 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఈసారి ఆ మార్క్ దాటుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. నవంబర్ రెండున ఫలితాలు వెలువడనున్నాయి.