రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు స్పీకర్ చింతకాయల ఆయ్యన్న పాత్రుడు చురకలు అంటించారు. ఆక్రమించిన స్థలాల్లో లే అవుట్స్ వేస్తుంటే ఏం చేస్తున్నారని మంత్రిని స్పీకర్ ప్రశ్నించారు. స్టేజ్‌ల మీద ఉపన్యాసాలు ఇస్తే కుదరదని, నియంత్రణ ఉండాలన్నారు. పదవులు, అధికారం శాశ్వతం అని ఎవరు అనుకోవద్దని.. మన హయాంలో ఏం చేశామో అదే ముఖ్యం అని పేర్కొన్నారు. ఒకే ప్రభుత్వం కలకాలం ఉంటుందని అనుకోవద్దని స్పీకర్ ఆయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరడ్కో ప్రాపర్టీ షోలో స్పీకర్ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
‘ఒకే ప్రభుత్వం కలకాలం ఉంటుందని అనుకోవద్దు. ఎన్టీఆర్, ఇందిరాలనే ఓడించిన జనం మన వాళ్ళు. పదవులు, అధికారం శాశ్వతం అని ఎవరు అనుకోవద్దు. మన హయాంలో ఏం చేశామో అదే ముఖ్యం. ఆక్రమించిన స్థలాల్లో లే అవుట్స్ వేస్తుంటే రెవెన్యూ మంత్రి ఏం చేస్తున్నారు. స్టేజ్‌ల మీద ఉపన్యాసాలు ఇస్తే కుదరదు, నియంత్రణ ఉండాలి. నర్సీపట్నంలో 150 ఎకరాల్లో అనాథరైజ్డ్ లే అవుట్స్ వేశారు. VMRDAలో ఎంక్వైరీ చేస్తే మా దగ్గర సమాచారం లేదంటున్నారు. అనుమతి లేకుండా లే అవుట్లు వేస్తుంటే యంత్రాంగం ఏం చేస్తుంది?. చెరువులు కబ్జా చేసి అనధికారిక అక్రమాలు చేస్తున్నారు. వీటన్నింటినీ రెవెన్యూ శాఖ దృష్టి సారించాలి. విశాఖపట్నం టూరిజం కోసం వచ్చిన వారు టీ తాగి వెళ్ళిపోరు. భర్త పెగ్ వేస్తుంటే.. భార్య ఐస్ క్రీం తింటూ ఎంజాయ్ చేయాలని కోరుకుంటారు. గోదావరి జిల్లాల వారు టూరిజం కోసం శ్రీలంక వెళ్ళిపోతున్నారు, మన డబ్బంతా అక్కడే ఉంది.గోవా పర్యటనకు వెళితే తెలుగు రాష్ట్రాల పర్యాటకులు అక్కడే ఉన్నారు’ అని స్పీకర్ చెప్పారు.