ఏపీలో అయ్యన్న పాత్రుడి ఇష్యూ పొలిటికల్ హీట్ ను పెంచింది. అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధాన్ని పెంచింది. దీంతో ఇరు పార్టీ నాయకులు ఈ వ్యవహారంలో విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. నర్సీపట్నంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే పోలీసులు అయ్యన్న పాత్రుడి ఇంటిని చుట్టుముట్టారు. కాగా అయ్యన్న అరెస్ట్ కు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. పంట కాలువలను ఆక్రమించుకొని గోడ కట్టడంతో వివాదం రాజుకుంది.
అయ్యన్న పాత్రుడి ఇంటి ఆక్రమణలను కూల్చివేయడం ఖాయమని అధికారులు చెబుతున్నారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే ఆపరేషన్ మొదలు పెట్టారు అధికారులు. గోడ కూల్చివేత విషయం తెలిసి టీడీపీ కార్యకర్తలు, అయ్యన్న అనుచరులు ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నారు. అయితే అనకాపల్లి నుంచి జేసీబీలను అధికారుల తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయ్యన్న ఇంటివైపు వస్తున్న టూవీలర్లను పోలీసులు వెనక్కి పంపిస్తున్నారు.
అయ్యన్నపాత్రుడిపై నర్సీపట్నం ఎమ్మెల్యే గణేష్ ఫైర్ అయ్యారు. అయ్యన్న ఒక పిల్లి అని.. జనం చూస్తేనే పూనకం వస్తుందని.. పోలీసులు వస్తే పిల్లిలా దాక్కుంటారని విమర్శించారు. అయ్యన్న రౌడీ అని, ఆయన ఆక్రమణలకు, కేసులకు సంబంధం లేదని అన్నారు. బీసీ కార్డు ఉంటే ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తారా..? అని ప్రశ్నించారు.