ఆనందయ్య మందును ఆయుర్వేధంగా గుర్తించే అవకాశం ఉన్నట్టు ఆయుష్ కమిషనర్ రాములు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆనందయ్య మందుపై తుది అధ్యయనం జరుగుతోందని, నిబంధనల ప్రకారం క్లినికల్ ట్రయల్స్, లైసెన్స్ వంటివి పూర్తయితే ఆయుర్వేధంగా గుర్తించవచ్చని రాములు పేర్కొన్నారు. ఆనందయ్య మందు తయారీలో వాడుతున్న పదార్ధాలన్నీ ఆయుర్వేదంలో వినియోగించేవే అని, ఆయుర్వేధంగా గుర్తింపు ఇచ్చే అంశం రాష్ట్ర పరిధిలో ఉందని, కానీ కేంద్రం సాయం తీసుకుంటామని రాములు పేర్కొన్నారు. అధ్యయన ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నది కాబట్టి ప్రస్తుతానికి ఆనందయ్య మెడిసిన్ ను ఆయుర్వేధంగా గుర్తించలేమని ఆయుష్ కమిషనర్ తెలిపారు.
మందు తయారీ విధానాన్ని బహిరంగ పరిచేందుకు ఆనందయ్య అంగీకరించారని, ఆనందయ్య ఇచ్చే ఐ డ్రాప్స్ లో కూడా ఎలాంటి హానికరాలు లేవని అన్నారు. తేనె, ముళ్ల వంకాయ, తోక మిరియాల మిశ్రమంతో ఐడ్రాప్స్ తయారు చేస్తున్నారని, ఐ డ్రాప్స్ వలన ఇబ్బందులు ఉండవని ఆయుర్వేద వైద్యుల బృందం నిర్ధారించినట్టు ఆయుష్ కమిషనర్ తెలిపారు. గతంలో ఆనందయ్య ఎవరెవరికి మందులు ఇచ్చారో వారి డేటాను సేకరించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. జిల్లేడు పువ్వులను శాస్త్రప్రకారం ఉపయోగిస్తే మందుగా ఉపయోగించవచ్చని అన్నారు. ఆనందయ్య మందు వాడాక కొందరికి ఇబ్బందులు వచ్చాయని తెలిసిందని, అయితే, మందు తీసుకున్నాక ఫాలో కావాల్సిన నియమాలు ఫాలో అయ్యారో లేదో చూడాల్సి ఉంటుందని అన్నారు. కృష్ణపట్నం ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కరోనా కేసులు తక్కువగా ఉన్నాయని, కరోనా డెత్స్ లేవని తెలిపారు. ఈరోజు సాయంత్రం వరకు నివేదిక ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని ఆయుష్ కమిషనర్ రాములు పేర్కొన్నారు