ఒకవైపేమో లోన్ యాప్ ల ద్వారా అప్పు తీసుకుని అవి తీర్చలేకపోతే యాప్ నిర్వాహకులు చేసే టార్చర్ భరించలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇది ఒక రకమైతే అప్పు తీర్చమన్నందుకు ఏకంగా ప్రాణాలు తీసేస్తున్న ఘటనలు ఇపుడు చోటు చేసుకోవడం భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఏలూరు జిల్లాలో ఇచ్చిన అప్పు తిరిగి తీర్చమన్నందుకు ఏకంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరికొన్ని చోట్ల అప్పు తీసుకున్నవారిపై దాడులకు పాల్పడం వంటి ఘటనలు కలకం రేపుతున్నాయి.
కిరాణా షాపులో ఒక వ్యక్తి తీసుకున్న అప్పు తీర్చమని డిమాండ్ చేసినందుకు షాపు యజమాని ఏకంగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఏలూరు జిల్లా దెందులూరు మండలం పోతునూరులో చోటు చేసుకుంది. దీనికి కొద్ది రోజుల ముందు గాలాయగూడెంలోనూ ఇదే తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. చిన్నచిన్న బాకీలు తీర్చలేకపోవడంతో తలెత్తుతున్న గొడవల్లో వరుసగా ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం వారివారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల్లోకి ఏలూరు జిల్లా దెందులురు మండలం పోతునూరులో తోట నాగరాజు కిరాణా షాప్ నడుపుతున్నాడు. అతని వద్ద చాలా కాలం నుండి సరుకులు తీసుకుని లింగాల కాంతారావు అనే వ్యక్తి బాకీ పడ్డాడు. బాకీ ఆరువేలు కావడంతో దాన్ని తీర్చాలని షాపు యజమాని డిమాండ్ చేసాడు. దీంతో మాటమాట పెరిగి నాగరాజుపై కాంతారావు కత్తితో దాడిచేసాడు. రక్తపు మడుగులో పడివున్న నాగరాజును ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.
Read Also: Andhra Pradesh: అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటుపై ప్రభుత్వం కసరత్తు
ఈ ఘటనకు కొద్ది రోజుల ముందే గాలాయగూడెం గ్రామానికి చెందిన సలాది ఉదయ్ కిరణ్ కు పాలడుగు దుర్గారావుకి మధ్య 3వేల రూపాయాల బాకీ విషయంలో వివాదం తలెత్తింది. తన డబ్బులు తిరిగి ఇవ్వడంలేదనే కసితో దుర్గారావు కొబ్బరికాయలు కొట్టే కత్తితో ఉదయ్ కిరణ్ పై దాడిచేసాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన ఉదయ్ కిరణ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. గతంలో అప్పు తీసుకున్న వారు తిరిగి ఇవ్వడంలో ఆలస్యమైతే వారిపై దారుణంగా దాడులు చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. అయితే ఇపుడు ఏకంగా ఒకరినొకరు చంపుకోవడం ఆందోళణ కలిగిస్తోంది. చిన్నచిన్న బాకీలు తీర్చకపోవడంతో ఏకంగా కత్తులతో దాడులు చేసి ప్రాణాలు తీస్తున్నారు. దీంతో అటు అప్పు తీసుకున్న వారి కుటుంబాలు, ఇటు అప్పు ఇచ్చిన వారి కుటుంబాలు మరింతగా నష్టపోతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా పోలిసులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Read Also: Jagadish Reddy : గుజరాత్‌లో వ్యవసాయానికి 6 గంటల విద్యుత్ మాత్రమే