Anantapur: చికెన్ సెంటర్‌లో సాధారణంగా కోళ్లు ఉంటాయి. చికెన్ సెంటర్ యజమానులు కోళ్లను కట్ చేసి ఆ మాంసాన్ని అమ్ముతుంటారు. కానీ అనంతపురంలోని ఒక చికెన్ సెంటరులో కోళ్లతోపాటు.. కొండ చిలువ కూడా దర్శనమిచ్చింది. చికెన్ షాపు యజమాని నీటి కోసం తన షాపులోని డ్రము మూత తెరవగా.. అందులో ఉన్నదానిని చూసి షాకై పరుగులు తీశాడు. ఇంతకీ డ్రమ్ములో ఏముందనుకుంటున్నారా? డ్రమ్ములో 9 అడుగుల కొండచిలువ ఉంది. డ్రమ్ములో కొండచిలువను చూసిన చికెన్ షాపు యజమాని భయంతో పరుగులు తీశాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో సోమవారం జరిగింది.
అనంతపురం జిల్లా పుట్టపర్తి మండల పరిధిలో ఈ ఘటన జరిగింది. ఎనుములపల్లి చెరువు సమీపాన చిత్రావతి బైపాస్ రోడ్డుకు ఆనుకుని ముక్తార్ అనే వ్యక్తి చికెన్ షాపును నిర్వహిస్తున్నాడు. ఈ చికెన్ షాపులోకి షాపు వెనుక ఉన్న కొండలో నుంచి ఆదివారం రాత్రి ఒక కొండ చిలువ చికెన్ సెంటరులోకి ప్రవేశించింది. చికెన్ షాపులోకి ప్రవేశించిన కొండ చిలువ నాలుగు బ్రాయిలర్ కోళ్లను తిన్నది. తర్వాత నీటి డ్రమ్ములోకి దూరింది. సోమవారం ఉదయం చికెన్ షాపుకు చేరుకున్న ముక్తార్ నీటి కోసం డ్రమ్ము వద్దకు వెళ్లాడు.. డ్రమ్ములో కొండ చిలువ కన్పించింది. భయపడిన ముక్తార్.. చుట్టుపక్కల వారికి చెప్పాడు. దీంతో అందరూ భయంతో పరుగులు తీశారు. దానిని బయటికి తీయడం కోసం పుట్టపర్తికి చెందిన స్నేక్ క్యాచర్ మూర్తికి సమాచారం అందించారు. దాంతో అతను అక్కడికి చేరుకుని కొండచిలువను పట్టుకున్నాడు. కొండ చిలువ సుమారు 9 అడుగులు ఉంది. కొండచిలువను పట్టుకొన్న తరువాత దానిని అటవీ ప్రాంతంలో వదిలి పెట్టి వచ్చారు.