ఏపీ ప్రభుత్వ తీరుపై కేంద్రమాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ అభివృద్ధి విషయంలో కేటీఆర్ చెప్పింది తప్పు అంటారా అని ఆయన ప్రశ్నించారు. ఒక మంత్రి జనరేటర్లు ఆన్‌చేశాం అంటారని… తెలంగాణ ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఏమో 14 నెలలు బిల్లు కట్టకపోవడంతోనే పవర్ కట్ చేశామంటున్నారని.. ఇదంతా ఎంటర్‌టైన్‌మెంట్‌కు పనికొస్తుంది తప్ప ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలను వైసీపీ ప్రభుత్వం ఎప్పుడో మరిచిపోయిందని అశోక్ గజపతిరాజు ఎద్దేవా చేశారు. ప్రభుత్వ నేతలు వారి బాధ్యతలను నిర్వహించడం మానేశారన్నారు. ప్రభుత్వానికి సిగ్గు ఉంటే ఇలా చేసేది కాదని తీవ్రంగా మండిపడ్డారు.
ఏపీ ప్రభుత్వం పిల్లల జీవితాలు, భవిష్యత్‌తో ఆడుకుంటోందని అశోక్ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నేతలు సమర్ధవంతంగా పనిచేయాలని.. అర్ధవంతంగా పనిచేయాలని సూచించారు. ప్రతిపక్ష నాయకులకు వరుసబెట్టి సమన్లు ఇవ్వడం సరికాదని.. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదన్నారు. సమస్యల పరిష్కారానికి ఎక్కడైనా కృషి చేస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకేలా బాధ్యత నిర్వహించిందన్నారు. రాష్ట్రానికి రావాల్సినవి కేంద్రం ఇవ్వకపోతే కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చినట్లు అశోక్ గజపతిరాజు గుర్తుచేశారు.