ఏపీలో రెవెన్యూ, దేవాదాయ శాఖల్లో ఉద్యోగాల నియామకానికి నిర్వహించే ప్రిలిమినరీ పరీక్ష తేదీలను మంగళవారం నాడు ఏపీపీఎస్సీ ప్రకటించింది. జులై 24న దేవాదాయశాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులకు స్క్రీనింగ్ పరీక్ష, జులై 31న రెవెన్యూ విభాగంలో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులకు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి హెచ్.అరుణ్ కుమార్ ప్రకటించారు.
కాగా ఆయా ఉద్యోగాలకు అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకోవడంతో వడపోత కోసం స్క్రీనింగ్ పరీక్షను పెట్టాల్సి వచ్చిందని ఏపీపీఎస్సీ కార్యదర్శి అరుణ్ కుమార్ పేర్కొన్నారు. ఆన్‌లైన్ పరీక్ష విధానాన్ని పక్కన పెట్టి ఈ రెండు పరీక్షలను ఆఫ్‌లైన్‌లోనే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. రెవెన్యూ, దేవాదాయ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి గత ఏడాది డిసెంబర్ 28న ఏపీపీఎస్సీ ప్రకటనలు జారీ చేసింది. రెవెన్యూ విభాగంలో 670, దేవాదాయశాఖలో 60 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లను ఇచ్చింది. ఈ పోస్టులకు డిగ్రీని విద్యార్హతగా నిర్ణయించారు.