ఏపీలో గ్రూప్-1 నిర్వహణలో గూడుపుఠాణీ జరిగిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. డిజిటల్, మాన్యువల్ వాల్యుయేషన్‌లో భారీ తేడాలు ఉన్నాయని.. దీంతో తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. డిజిటల్, మాన్యువల్ వేల్యూయేషన్‌లో 202 మంది అవుటయ్యారన్నారు. స్పోర్ట్స్ కోటాలో కోతలు విధించడంతో ఆశావహులు ఆందోళనతో ఉన్నారని ఆరోపించారు. ఈ అవకతవకలపై గవర్నర్ దృష్టి సారించి న్యాయవిచారణ జరపాలని లోకేష్ కోరారు.
గ్రూప్ 1 ఇంటర్య్వూల ఎంపికలో అక్రమాలకు పాల్పడిన వందలాది మంది ప్రతిభావంతులకు తీరని అన్యాయం జరిగిదని.. ఈ విషయంలో సర్కారువారి పాట ఎంతో చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. జగన్ సర్కారు వారి పాటపై ఆట కట్టిస్తామని హెచ్చరించారు. 30కి పైగా సీబీఐ, ఈడీ కేసుల్లో ఏ1 నిందితుడిగా ఉన్న సీఎం జగన్ ఆధ్వర్యంలో ఏపీపీఎస్సీ గ్రూప్-1 కూడా అవకతవకలతోనే సాగిందని ఎద్దేవా చేశారు. డిజిటల్ విధానంలో ఎంపికైన 326 మందిలో 124 మంది మాత్రమే మాన్యువల్ వేల్యూయేషన్‌లో ఎంపిక కావడం వెనుక మతలబేంటని ప్రశ్నించారు. డిజిటల్‌లో మాయాజాలం జరిగిందా లేదా మాన్యువల్‌లో అవకతవకలు చోటు చేసుకున్నాయా అనేది ప్రభుత్వం వివరణ ఇవ్వాలన్నారు.
గతంలో ఎంపికై తాజా జాబితాలో 202 మంది పేర్లు గల్లంతు కావడంపై ఏం సమాధానం చెబుతారని ప్రభుత్వాన్ని లోకేష్ నిలదీశారు. డిజిటల్ వేల్యూయేషన్‌లో 142 మంది తెలుగు మీడియం వాళ్లు ఎంపిక కాగా మాన్యువల్‌లో 47 మంది మాత్రమే సెలెక్ట్ కావడం వెనుక ఏ జగన్నాటకం నడిచిందో చెప్పాలన్నారు. ప్రశ్నలు-జవాబులు మారనప్పుడు ఈ స్థాయిలో డిజిటల్ మాన్యువల్ వేల్యూయేషన్‌లో తేడాలు ఎవరి కోసం తారుమారై వచ్చాయో వెల్లడించాలన్నారు. స్పోర్ట్స్ కోటాలో ఇంటర్వ్యూకి 75 మంది ఎంపికైతే మూడునెలల్లో పూర్తి చేయాల్సిన మాన్యువల్ వాల్యుయేషన్‌ని 8 నెలలు సాగదీసి 48 మందికి కుదించారన్నారు. అర్హులై ఉండి కూడా ఎంపికకాని అభ్యర్థులకు న్యాయం చేయాలని లోకేష్ డిమాండ్ చేశారు.