నరేంద్రమోదీ షా ఈ ఇద్దరు దేశాన్ని అమ్మేస్తున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ విమర్శించారు. భారత్ ను కొద్దిమంది వ్యక్తులకు అమ్మివేసే బీజేపీ నేతలు దేశ ద్రోహులు అని ఆయన ఆరోపించారు. అడవులను అటవీ సంపదను, లాభాల్లో ఉన్న ఎల్ఐసీని, రైల్వే ను విమానాలను అమ్మేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాజులు పరిపాలించాలి, డబ్బు అంతా బడా బాబుల వద్ద ఉండాలన్న విధంగా ఈ బడ్జెట్ ఉందని ఆయన అన్నారు. అదాని అంబానీ వంటి కార్పొరేట్ సంస్థలకు బీజేపీ ఊడిగం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంపై నోరు విప్పడానికి కూడా సీఎం జగన్ కు ధైర్యం లేదని, రాష్ర్టానికి అన్యాయం జరుగుతున్నా.. వైసీపీ ఎంపీలు ఒక్క మాట మాట్లాడటం లేదని ఆయన ధ్వజమెత్తారు.
అంతా తెలుకుట్టిన దొంగల్లా ఉన్నారని, వైసీపీ ఎంపీలు మేలుకున్నారో..? పడుకున్నారో..? అర్థం కావడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ఎంపీలకు ఎమ్మెల్యే లకు రెండు విషయాల్లో పర్మిషన్ ఇచ్చారని, ల్యాండ్ మాఫియా చేయమని, స్టిక్కర్లు వేసుకొని తిరగమని ఇచ్చారని ఆయన అన్నారు. 10వ తేదీ నుంచి అనంతపురం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతామని ఆయన స్పష్టం చేశారు.