CPS Employees: సెప్టెంబర్ 1న సీపీఎస్ ఉద్యోగులు తలపెట్టిన ఛలో విజయవాడ వాయిదా పడింది. ఈ మేరకు ఏపీసీపీఎస్‌ఈఏ ఉద్యోగులు ఓ ప్రకటన జారీ చేశారు. APCPSEA ఆధ్వర్యంలో గత ఏడు సంవత్సరాలుగా సెప్టెంబర్ 1వ తేదీన శాంతియుత ర్యాలీ, సభల ద్వారా సీపీఎస్ రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నామని తెలిపారు. ఈ శాంతియుత నిరసన కార్యక్రమాలకు ప్రతిసారి పోలీసు అనుమతి తీసుకుని నిర్వహిస్తూ వచ్చామని.. అలాగే సెప్టెంబర్ 1న చలో విజయవాడ పేరుతో నిర్వహించబోయే సభ ర్యాలీకు కూడా పోలీస్ శాఖ అనుమతి కోరామని.. కానీ ఏ నిర్ణయం పోలీస్ శాఖ చెప్పకుండానే సీపీఎస్ ఉద్యోగులను నోటీసులు, బైండోవర్ కేసులతో పాటు ఇంకొన్ని కేసులను మోపుతూ సీపీఎస్ ఉద్యోగులను వారి కుటుంబ సభ్యులను ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
Read Also: అంతర్జాతీయ టీ20ల్లో ఎక్కువ సార్లు డకౌట్ అయిన టీమిండియా ఓపెనర్లు
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో CPS ఉద్యోగులకు ఇబ్బందికర వాతావరణం నెలకొందని.. కావున ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా, CPS ఉద్యోగుల శ్రేయస్సు దృష్ట్యా సెప్టెంబర్ 1న విజయవాడలో తలపెట్టిన చలో విజయవాడ నిరసన కార్యక్రమాన్ని సెప్టెంబరు 11వ తేదీకి వాయిదా వేయాలని రాష్ట్ర శాఖ నిర్ణయించిందని ఏపీసీపీఎస్‌ఈఏ ఉద్యోగులు ప్రకటించారు. సీపీఎస్ ఉద్యోగులు ఎవరూ కూడా సెప్టెంబర్ 1న ఛలో విజయవాడ కార్యక్రమానికి హాజరకావద్దని తెలియజేస్తున్నామన్నారు. సెప్టెంబర్ 11వ తేదీన విజయవాడలో చలో విజయవాడ కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించాలని నిర్ణయించామని పేర్కొన్నారు.