ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలతో ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ రేపు జరగనుంది. ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అన్ని జిల్లాల్లో కౌంటింగ్ ప్రక్రియ సాఫీగా సాగేందుకు వీలుగా ఐఏఎస్ అధికారుల్ని పరిశీలకులుగా నియమించారు. ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 206 కేంద్రాల్లో కౌంటింగ్ జరగనుంది. ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన పరిషత్ ఎన్నికల పోలింగ్ ను రద్దు చేస్తూ గతంలో ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలపై ఎన్నికల సంఘం హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది.
పిటిషనర్లు..ఎన్నికల సంఘం తరపున లాయర్ల వాదనలు విన్న బెంచ్ సింగిల్ జడ్జ్ తీర్పును రద్దు చేస్తూ ఓట్ల లెక్కింపుకు అనుమతి ఇచ్చింది. కోర్టు నుంచి క్లియరెన్స్ రావటంతో ఎన్నికల సంఘం రేపు పరిషత్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం చేసింది. ఏపీలో మొత్తం 10,047 ఎంపీటీసీ స్థానాలున్నాయి. వివిధ కారణాలతో నోటిఫికేషన్ జారీ సమయంలో.. 375 స్ధానాలకు ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. గతేడాది మార్చి7న ఎన్నికల నిర్వహణ చేపట్టారు. మొత్తం 9672 స్ధానాల్లో ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో 2371 స్ధానాలు ఏకగ్రీవం అయ్యాయి. సుదీర్ఘ ప్రక్రియలో అభ్యర్ధుల మృతితో 81 స్ధానాల్లో పోలింగ్ నిలిచిపోయింది.
ఈ ఏడాది ఏప్రిల్ 8న.. 7220 స్ధానాలకు ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 18,782 మంది అభ్యర్ధులు పోటీ చేశారు. రాష్ట్రంలో మొత్తం జడ్‌పీటీసీ స్థానాలు 660 ఉండగా.. ఇందులో నోటిఫికేషన్ జారీ సమయంలో.. 8 చోట్ల ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. ఆ తర్వాత ఈ ఏడాది మార్చి7న 652 స్ధానాలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో 126 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. చివరికి ఈ ఏడాది ఏప్రిల్8వ తేదీన.. 515 స్ధానాలకు పోలింగ్ జరిగింది. ఇందులో మొత్తం 2058 అభ్యర్ధులు పోటీ చేశారు. ఇప్పుడు వీరందరి భవితవ్యం రేపు తేలబోతోంది.