టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో గ్యాంగ్ రేప్ ఘటనపై టీడీపీ నేతలు రాద్ధాంతం చేయడంపై ఆమె మండిపడ్డారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మహిళా కమిషన్ తూతూ మంత్రంగా ఉందని ఆరోపించారు. బోండా ఉమ మహిళా కమిషన్ సుప్రీమా అంటున్నారని.. బోండా ఉమ లాంటి ఆకు రౌడీలకు మహిళా కమిషన్ సుప్రీమేనని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. చంద్రబాబుకు బాధితులను ఎలా పరామర్శించాలో కూడా తెలియదా అని ప్రశ్నించారు.
బాధితురాలి మంచం దగ్గర కూడా 50 మంది ఉన్నారని.. అత్యాచార బాధితురాలిని ఇలా పరామర్శిస్తారా అంటూ వాసిరెడ్డి పద్మ నిలదీశారు. అత్యాచారం జరిగితే రాజకీయం చేస్తారా అంటూ మండిపడ్డారు. రాజకీయం కన్నా మానవత్వం మరిచారనే చంద్రబాబుకు సమన్లు జారీ చేశామన్నారు. అత్యాచార బాధితురాలి గదిలో కేకలు వేస్తారా.. మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌పై ప్రవర్తించే తీరు ఇదేనా అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. తన మీదే నిందలు వేయడం తగదన్నారు. చంద్రబాబు యుద్ధం చేయడానికి వచ్చారా? పరామర్శకు వచ్చారో సూటిగా చెప్పాలన్నారు.
రాష్ట్రంలో ఉన్న మహిళలకు తాను ప్రతినిధిని అని.. వాళ్లకు తానెలా సమాధానం చెప్పాలని వాసిరెడ్డి పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు వైఖరిపై సమన్లు ఇవ్వకపోతే చప్పట్లు కొడతారా అని ఎద్దేవా చేశారు. ఈనెల 27న చంద్రబాబు, బోండా ఉమ మహిళా కమిషన్ దగ్గరకు వచ్చి నాలుగు కోట్ల మందికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ చట్ట ప్రకారం మహిళా కమిషన్ ఉందో చంద్రబాబు తెలీదా అని వాసిరెడ్డి పద్మ నిలదీశారు.