తెలుగు రాష్ట్రాల మధ్య దశాబ్ద కాలంగా కొనసాగుతున్న నదీజలాల వివాదాలకు ముగింపు పలికే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడాలను పరిష్కరించేందుకు కేంద్ర జలశక్తి శాఖ ఒక ఉన్నత స్థాయి కమిటీని నోటిఫై చేస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర జలసంఘం (CWC) చైర్మన్ నేతృత్వంలో పనిచేసే ఈ కమిటీలో ఇరు రాష్ట్రాల జలవనరుల శాఖకు చెందిన అత్యున్నత స్థాయి అధికారులు సభ్యులుగా ఉండనున్నారు. గత 11 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను సహకార సమాఖ్య స్ఫూర్తితో పరిష్కరించడమే ఈ కమిటీ ప్రధాన లక్ష్యం.
ఈ కమిటీ కూర్పును పరిశీలిస్తే, ఇందులో రెండు రాష్ట్రాల నుంచి కీలక ప్రతినిధులకు చోటు కల్పించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి జలవనరుల శాఖ సలహాదారు, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ప్రభుత్వ స్పెషల్ సెక్రటరీ మరియు ఇంజనీర్-ఇన్-చీఫ్ సభ్యులుగా వ్యవహరిస్తారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తరపున జలవనరుల శాఖ స్పెషల్ సెక్రటరీ, శాఖ సలహాదారు, ఇంజనీర్-ఇన్-చీఫ్ (ఇరిగేషన్) మరియు చీఫ్ ఇంజనీర్లు ప్రాతినిధ్యం వహిస్తారు. వీరితో పాటు కృష్ణా నది యాజమాన్య బోర్డు (KRMB), గోదావరి నది యాజమాన్య బోర్డు (GRMB) చైర్మన్లు, నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (NWDA) మరియు CWC చీఫ్ ఇంజనీర్లు కూడా ఈ కమిటీలో భాగస్వామ్యులై సాంకేతిక అంశాలను పర్యవేక్షిస్తారు.
CNAP Service: ఇంటర్నెట్ అవసరం లేదు.. యాప్‌తో పని లేదు.. ఫోన్ స్క్రీన్‌పై డైరెక్ట్‌గా కాలర్ పేరు
ఈ కమిటీ ఏర్పాటుకు బీజం జూలై 2025లో ఢిల్లీలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పడింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో జరిగిన ఆ సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొని తమ అభ్యంతరాలను, వివాదాలను ప్రస్తావించారు. ఆ చర్చల ఫలితంగానే, సమస్యలను సాంకేతికంగా పరిశీలించి పరిష్కార మార్గాలను సూచించేందుకు ఉమ్మడి కమిటీ అవసరమని భావించారు. ఇందుకోసం ఇరు రాష్ట్రాలు తమ ప్రతినిధులను నామినేట్ చేయాలని కోరగా, డిసెంబర్ 2025లో తెలంగాణ ప్రభుత్వం తన నామినేషన్లను పూర్తి చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ కమిటీని అధికారికంగా నోటిఫై చేసింది.
కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి గతంలో ఏర్పాటు చేసిన కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-2 (KWDT-2) గడువును కూడా కేంద్రం 2026 జూలై వరకు పొడిగించి, వివాదాల పరిష్కారానికి నిరంతర సహకారాన్ని అందిస్తోంది. ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 84 ప్రకారం ఏర్పడిన అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాల మేరకు, ఇప్పుడు ఏర్పాటైన ఈ నూతన కమిటీ క్షేత్రస్థాయిలో ఉన్న జలవివాదాలను లోతుగా అధ్యయనం చేయనుంది. ఈ కమిటీ రాకతో గోదావరి, కృష్ణా నదీ జలాల వినియోగంపై నెలకొన్న సందిగ్ధత తొలగిపోయి, రెండు రాష్ట్రాల రైతులకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు.
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్..